చంద్రుడి ఉపరితలంపై లోతు పెరిగేకొద్ది తగ్గుతున్న ఉష్ణోగ్రత

చందమామపై విజయవంతంగా దిగిన చంద్రయాన్‌-3 మిషన్‌ ఇప్పుడు చంద్రుడి ఉపరితలంపై తన పరిశీలనను మొదలుపెట్టింది. ఈ నెల 23న విజయవంతంగా చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్‌లోని ఛేస్ట్ పేలోడ్  పంపించిన ఈ తొలి ఫలితాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదివారం వెల్లడించింది. చంద్రుని దక్షిణ ధ్రువం వెంబడి ఉపరితలంలోని నేల ఉష్ణోగ్రతల తీరును ఛేస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) కొలిచిందని ఇస్రో తెలిపింది.
దీని ఆధారంగా చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు మారే తీరును అర్థం చేసుకోవచ్చునని తెలిపింది.  ఈ క్రమంలో ఛేస్ట్ పేలోడ్‌ తొలి పరిశీలనకు సంబంధించిన గ్రాఫ్‌ను ఇస్రో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ (X) లో షేర్‌ చేసింది.  అంటే, వేడి తగిలినపుడు ఏదైనా వస్తువు ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవచ్చు. పరిసరాల నుంచి వచ్చే వేడిని ఏదైనా వస్తువు స్వీకరించినపుడు దాని ఉష్ణోగ్రత పెరుగుతోందా? లేదా? వంటి విషయాలను తెలుసుకోవచ్చు.
ఇస్రో పంపిన ఆ గ్రాఫ్‌ ప్రకారం చంద్రుడి ఉపరితలం నుంచి లోతుకు వెళ్తున్నా కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు, పైకి వెళ్తున్నా కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లు తెలుస్తున్నది.  చంద్రుడి ఉపరితలంపై వివిధ లోతులలో ఉష్ణోగ్రతల్లో మార్పులను ఇస్రో గ్రాఫ్‌ సూచిస్తున్నది. ఒక మాపనాన్ని లోతుకు పంపి చంద్రుడి దక్షిణ ధృవానికి సంబంధించిన ఉష్ణోగ్రత వివరాలను పరిశీలించడం ఇదే తొలిసారని, ఇంకా సమగ్ర పరిశీలన కొనసాగుతున్నదని ఇస్రో తెలిపింది. 

చంద్రుని ఉపరితలంలో 10 సెంటీమీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి ఉష్ణోగ్రతలను కొలిచేందుకు తగిన పరికరాలను ఛేస్ట్‌లో అమర్చినట్లు ఇస్రో తెలిపింది. ఉపరితలం నుంచి క్రిందికి చొచ్చుకెళ్లే ప్రక్రియ నియంత్రణతో జరుగుతుందని తెలిపింది. దీనికి విడివిడిగా 10 టెంపరేచర్ సెన్సర్లను అమర్చినట్లు తెలిపింది.

కాగా, ఎంచుకున్న మూడు నిర్ణీత లక్షాలలో రెండింటిని ఈ మిషన్‌లో ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ఇస్రో శనివారం రాత్రి తెలిపింది. మొదటి కీలక లక్ష్యం చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌక సాఫ్ట్ ల్యాండింగ్.  ఇక రెండో లక్ష్యంలో ల్యాండర్ విక్రమ్ నుంచి సజావుగా రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపైకి రావడం. ఇది కూడా సక్రమంగా జరిగింది. ఇక మిగిలింది సాగుతున్నదీ చంద్రుడిపై శాస్త్రీయ పరిశోధనలు సాగించడం, అన్ని పేలోడ్స్ సక్రమంగా పనిచేస్తూ ఉండటంతో ఈ మూడో లక్షం కూడా విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.