భారీ పేలుళ్లకు రెక్కీ చేసిన దోషులకు పదేళ్లు జైలు శిక్ష

భారీ పేలుళ్లకు రెక్కీ చేసిన దోషులకు పదేళ్లు జైలు శిక్ష
హైదరాబాద్, ఢిల్లీలలో భారీ పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన దోషులకు పదేళ్లు జైలుశిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు జైలు శిక్ష పడింది. నలుగురికి పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలువరించింది. 
హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు దోషులు రెక్కీ నిర్వహించారు. పేలుళ్ల కోసం ఆయుధాలు సైతం సమకూర్చుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఒబేద్ రహమాన్ , బీహార్ కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ లను 2013లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి దేశంలో పలు చోట్ల పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నారు. 2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్లు, 2013లో దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉంది. గతంలో వారణాసి, ముంబయి, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూర్ లో జరిగిన పేలుళ్లలోనూ నలుగురు నిందితుల పాత్ర ఉంది. 

ఈ కేసులలో మొత్తం 11మందిని నిందితులుగా జాతీయ దర్యాప్తు సంస్థ చేర్చింది. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్‌తో పాటు మరో నిందితుడు ఉన్నాడు. జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది. జూలై 7వ తేదీన ఈ నలుగురు నిందితులను దోషులుగా తీర్చిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం నాడు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.