తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా నిర్మించి, రంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆదివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఆహ్వానాలు అందించడంలో ప్రోటోకాల్ పట్టించుకోలేదని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు, ఎమ్యెల్యేలకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు అందలేదని, అందుకనే ప్రతిపక్షాలకు చెందిన వారెవ్వరూ హాజరు కాలేదని చెబుతున్నారు.
ఈ విషయమై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. కనీసం ప్రధమ పౌరురాలినే రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను కూడా ఆహ్వానించలేదు. సాధారణంగా, ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గాని, లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గాని ఎంపీలు, ఎమ్యెల్యేలకు ఆహ్వానాలు అందవలసి ఉంది.
అయితే, హోదాలో ఎంతో తక్కువైనా జాయింట్ కలెక్టర్ల చేత వారికి ఫోన్ చేయించారు. దానితో అవమానకరంగా భావించి ఎవ్వరూ హాజరు కాలేదు. మరోవంక, చివరకు తన మంత్రివర్గంలోని మంత్రుల విషయంలో సహితం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదు. సచివాలయం సందర్భంగా, పక్షం రోజుల ముందు డా. అంబెడ్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా దినపత్రికలలో పూర్తిపేజి ప్రకటనలను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది.
ఈ ప్రకటనలలో నిలువెత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి. మరెవ్వరి ఫోటో కాకపోయినా కనీసం పేరుకూడా లేదు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం జారీచేసే ఇటువంటి ప్రకటనల్లో సంబంధిత మంత్రుల ఫోటోలు సహితం చిన్నవిగా ప్రచురిస్తుంటారు.
ఆ విధంగా అంబెడ్కర్ విగ్రవిష్కరణకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సచివాలయం ప్రారంభోత్సవ ప్రకటనకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతారెడ్డిల ఫోటోలను కూడా ప్రచురింప వలసి ఉంది. వాస్తవానికి సచివాలయం నిర్మాణంలో మొదటి నుండి ప్రశాంతారెడ్డి అంతా తానై పర్యవేక్షణ జరిపారు. ఈ పత్రికా ప్రకటనలలో కనీసం వాటి నిర్మాణం చేపట్టిన ఆయా మంత్రిత్వ శాఖల పేర్లు కూడా లేవు.
ప్రభుత్వ ప్రకటనలలో మంత్రుల ఫోటోలను, పేర్లను ప్రచురింప వలసిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినదా? ఆ మేరకు ప్రోటోకాల్ నిబంధనలతో మార్పులు చేసిందా? అంటే, మే డే సందర్భంగా సోమవారం జారీచేసిన ప్రకటనలో సీఎం కేసీఆర్ తో పాటు కార్మిక మంత్రి మల్లారెడ్డి ఫోటో కూడా దర్శనమిచ్చింది. అంటే కేవలం కొప్పుల ఈశ్వర్, ప్రశాంతారెడ్డిల విషయంలోనే కేసీఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ ను పక్కన పెట్టినట్లు అర్థం అవుతుంది.
మరోవంక, సచివాలయం ప్రారంభోత్సవంకు పంజాబ్, ఢిల్లీ, ఒడిసా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 70 మందికి పైగా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపారు. వారికి రానుపోను విమాన చార్జీలనూ భరిస్తోంది. వారి బస కోసం ఓ స్టార్ హోటల్లో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసింది. మీడియాకు ఇచ్చిన గౌరవం కూడా విపక్ష ప్రజా ప్రతినిధులకు ఇవ్వలేదని సదరు నేతలు వాపోతున్నారు.
మరోవంక, ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, విలేకరులకూ ఆహ్వానాలు పంపింది. కానీ స్థానికంగా ఉండే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’, ‘ఆంధ్రజ్యోతి’కి ఆహ్వానాన్ని నిరాకరించింది. ఆంధ్రజ్యోతి, కొత్త సచివాలయంలోకి అడుగు పెడితే, మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయనే భయపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ సౌధంలోకి మీడియాపై ఆంక్షలు విధించడం బహుశా దేశంలో మరెక్కడా జరిగి ఉండదు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు