ది కేరళ స్టోరీ ట్రైలర్ వివాదంపై మండిపడ్డ అదా శర్మ, డైరెక్టర్

కేరళలో కొంతమంది అమ్మాయిలను మతం మార్చి ఉగ్రవాదంలోకి తీసుకెళ్తున్నారు. దీనిపై బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు వస్తూ కేరళ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారాయి. ఇటీవల ఇలా అమ్మాయిలు మాయమై ఉగ్రవాదం వైపు వెళ్తున్న సంఘటనలపై సినిమాని తీశారు.  ది కేరళ స్టోరీ అనే టైటిల్ తో కొన్ని రోజుల క్రితం ఓ టీజర్ ని రిలీజ్ చేయగా అది కేరళ వ్యాప్తంగా దుమారం రేపింది. దీనికి కొంతమంది మద్దతు ఇస్తుంటే,  మరికొంతమంది విమర్శిస్తున్నారు. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది.

ది కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మ, సిద్ది ఇదాని, యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇందులో  కొంతమంది హిందూ, క్రైస్తవ అమ్మాయిలు చదువు, ఉద్యోగం కోసం కేరళలోని మాములు పల్లెటూళ్ళ నుంచి సిటీకి వస్తారు. అక్కడ కొంతమంది ఉగ్రవాద గ్రూపులకు సంబంధించిన మహిళలు వీరిని ఇస్లాం మతంలోకి మారేలా చేస్తారు.

కొన్ని సంఘటనలను సృష్టించి వారంతట వారే మతం మారేలా చేస్తారు. అనంతరం ఉగ్రవాద గ్రూప్ కి సంబంధించిన అబ్బాయిలు వారిని ప్రేమలో దింపి పెళ్లి చేసుకొని పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్.. ఇలా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వీరితో ఉగ్రవాద వ్యవహారాలు చేయిస్తారు. అయితే ఇలా జరుగుతున్నట్టు కూడా ఎవ్వరికి తెలీదు. తమ పిల్లలు కనపడకుండా పోయారని తల్లితండ్రులు ఫిర్యాదులు చేసి బాధపడతారు.

 ది కేరళ స్టోరీ ట్రైలర్ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ లో దాదాపు ఇప్పటికే 32,000 మంది అమ్మాయిలు కేరళలో కనిపించకుండా పోయారని తెలిపారు. కేరళలో కూడా ఇలా జరుగుతున్నట్టు అప్పుడప్పుడు వార్తలు వస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు.

పోలీస్ విచారణకు కేరళ సీఎం ఆదేశం

ఈ సినిమాను నిషేధించాలని కేరళలోని అధికార పక్షం సిపిఎం, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుండటం గమనార్హం. హిజాముఖ్యమంత్రి బ్‌, లవ్‌ జిహాద్‌ ఇతివృత్తంతో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ కథను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ఖండించడంతో ఈ చిత్రం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తే సంఘ్‌ పరివార్‌ సిద్ధాంతాలను హైలెట్‌ చేస్తున్నదని, లవ్‌జిహాద్‌ పేరిట మతపరమైన విద్వేషాలను వ్యాప్తి చేస్తూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు ఉన్నదని విజయన్‌ ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

‘ది కేరళ స్టోరీ’ సినిమా టీజర్‌, అందులోని డైలాగ్‌లు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఈ సినిమా విడుదలను నిషేధించాలని అందిన ఫిర్యాదులపై సీఎం విజయన్‌ స్పందిస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరపాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. తిరువనంతపురం పోలీస్‌ కమిషనర్‌ అనిల్‌కాంత్‌ ఈ సినిమాపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాతనే సినిమా విడుదలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం విజయన్‌ పేర్కొన్నారు.

కాగా, ది కేరళ స్టోరీ విమర్శలపై హీరోయిన్ అదా శర్మ, డైరెక్టర్ సుదీప్తో సేన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.  ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో అదా శర్మ మాట్లాడుతూ అసలు అమ్మాయిలు కనిపించకుండా పోవడమే చాలా బాధాకరం. వారంతా ఏమయ్యారో అనే దాని గురించి ఆలోచించకుండా కనపడకుండా పోయింది అంతమంది కాదని తాము ట్రైలర్ లో చూపించిన కౌంట్ గురించి మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.

 ఇది చాలా దారుణం అంటూ అంటే ఎంతోకొంతమంది కనిపించకుండా పోయారు కదా? అని ఆమె ప్రశ్నించారు. “నేను కొంతమంది అమ్మాయిలని కలిశాను. వాళ్ళ బాధని మాటల్లో చెప్పలేను. అక్కడి నుంచి బయటపడిన కొంతమంది బాధితుల వివరాలు సేకరించి వాటి ఆధారంగానే సినిమాను తీశాం. మీరు సినిమా చూస్తే అసలు నంబర్ గురించి మాట్లాడారు” అని ఆమె హితవు చెప్పారు.

ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ మాట్లాడుతూ ఈ సినిమా తీయడానికి చాలా పరిశోధన చేశామని, దాదాపు ఏడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డామని తెలిపారు. ఆర్టిఐ చట్టం ద్వారా ఎంతమంది అమ్మాయిలు తప్పొపోయారో సమాచారం అడుగుతుంటే వాళ్ళు తమకు సమాధానం చెప్పట్లేదని, వాళ్ళు సహకరించలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
ఇప్పటివరకు కూడా తమకు సమాధానం ఇవ్వలేదని చెప్పారు. “ఈ కథ నా హృదయాన్ని మెలిపెట్టింది. వీటి గురించి మొదట విన్నప్పుడు ఇలాంటివి మన దేశంలో కూడా జరుగుతాయా అనుకున్నాను. కానీ రీసెర్చ్ చేశాక నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. దీని గురించి అంతా తెలుసుకున్నాకే సినిమా తీశాను” అని స్పష్టం చేశారు. ఇక ది కేరళ స్టోరీ సినిమా మే 5న విడుదల కానుంది.