కరోనా మహమ్మారిని నివారించడానికి అనేక టీకాలు, మందులు అందుబాటులోకి వస్తున్నా కరోనా తన రూపురేఖలను మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కొవిడ్ వేరియంట్‌కు చెందిన సబ్ వేరియంట్ బీఏ .4.6 అమెరికాలో వేగంగా వ్యాపిస్తుండగా, ఇప్పుడు బ్రిటన్‌లో కూడా వేగం పుంజుకుంటోంది.
యుకె హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యుకెహెచ్‌ఎస్‌ఎ) గుర్తించిన సమాచారం ప్రకారం ఆగస్టు 14తో ప్రారంభమయ్యే వారంలో బ్రిటన్‌లో బిఎ .4.6 కేసులు 3.3 శాతం ఉండగా, ఇప్పటికి 9 శాతం వరకు కేసులు పెరిగాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం బిఎ.4.6 వేరియంట్ ఇప్పుడు అమెరికా అంతటా ఇటీవలి కేసుల్లో 9 శాతం పైగా ఉంది. ఇతర దేశాల్లోనూ ఈ వేరియంట్‌ను గుర్తించారు.
ఈ కొత్త వేరియంట్ గురించి వైద్య నిపుణులు, పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం ఒమిక్రాన్ బిఎ.4 వేరియంట్ రూపాంతరమే బిఎ.4.6 వేరియంట్. బీఎ 4 ను మొదటిసారి 2022 జనవరిలో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. అప్పటి నుంచి ఇది బీఏ 5 వేరియంట్‌తోపాటు ప్రపంచమంతటా వ్యాపించింది.
అయితే బిఎ 4.6 వేరియంట్ ఎలా ఆవిర్భవించిందో స్పష్టంగా తెలియదు. కానీ అది రీకాంబినెంట్ వేరియంట్ కావచ్చునని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనాకు కారణమయ్యే సార్స్ కొవి2 కు చెందిన రెండు వేర్వేరు రకాలు ఒకే వ్యక్తికి ఒకే సమయంలో సోకినప్పుడు రీకాంబినెంట్ (పునఃసంయోగం) జరుగుతుందని, దీని కారణంగా ఈ వేరియంట్ ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
అనేక విధాలుగా బిఎ.4 మాదిరిగానే బిఎ.4.6 వేరియంట్ ఉంటుంది. ఇది వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రొటీన్‌కు మ్యుటేషన్‌ను కలిగిస్తుంది. ఈ ప్రొటీన్ మన కణాల్లోకి ప్రవేశించడానికి వైరస్‌కు అనుమతిస్తుంది. ఈ మ్యుటేషన్ ఆర్ 346 టి ఇతర రూపాంతరాల్లో కనిపించింది కూడా. రోగనిరోధకతను తప్పించుకునే విధంగా వ్యవహరిస్తుంది.
అంటే వ్యాక్సినేషన్ వల్ల, ముందస్తు సంక్రమణ వల్ల చేకూరిన యాంటీబాడీలను (ప్రతిరోధకాలను) తప్పించుకోడానికి వీలుగా వైరస్‌కు సహాయపడుతుంది. అయితే తీవ్రత, వ్యాధి వ్యాప్తి, రోగనిరోధకతను ప్రతిఘటించడంలో తక్కువ ప్రభావమే దీనికి ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి.
ఈ వేరియంట్ తీవ్రమైన లక్షణాలను సంక్రమింప చేస్తుందని చెప్పే నివేదికలు లేకున్నా జాగ్రత్తలు తీసుకోవడం కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదివరకటి వేరియంట్లు కంటే ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్కువ వ్యాప్తి కలిగినదని చెబుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడంలో బిఎ 5 కన్నా బిఎ 4.6 వేరియంట్ చాలా చురుకుగా కనిపిస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ వేరియంట్ ఆధిపత్యం వహిస్తోంది. ఇంకా లోతుగా అధ్యయనం చేయని సమాచారమైనప్పటికీ అభివృద్ధి చెందుతున్న ఇతర డేటా దీనికి మద్దతు ఇస్తుంది. అసలైన కరోనా వ్యాక్సిన్ ‘ఫైజర్’ తాలూకు మూడు డోసులు పొందిన వ్యక్తులు బిఎ 4లేదా బిఎ 5 కంటే బిఎ.4.6 వేరియంట్‌కు ప్రతిస్పందనగా తక్కువ యాంటీబాడీలను (ప్రతిరోధకాలను) ఉత్పత్తి చేస్తారని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ వెల్లడించింది.
బిఎ 4.6 వేరియంట్‌కు వ్యతిరేకంగా కరోనా వ్యాక్సిన్లు తక్కువ ప్రభావం చూపిస్తాయని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కొత్త బైవాలెంట్ (ద్విపద) బూస్టర్ల ద్వారా ఈ బిఎ 4.6 వేరియంట్‌ను కొంతవరకు అదుపు చేయవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ మరణాల సంఖ్య తక్కువ నమోదవ్వడంతో.. ఈ వేరియంట్ కూడా అంత తీవ్రం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్న వ్యక్తుల్లో బిఎ.4, బిఎ.5 కన్నా.. బిఎ.4.6 వేరియంట్ తక్కువ ప్రభావమే చూపుతుందని ఆక్స్ఫార్డ్ విశ్వవిద్యాలయం నివేదించింది.
వ్యాక్సిన్లకు స్పందించని వ్యక్తుల్లో ఈ వేరియంట్ ప్రమాదమేనని సూచిస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నా.. వాటిని ఎదుర్కోవడానికి.. రోగనిరోధకశక్తిని పెంచుకునేలా… ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకునేలా మల్టీ వాలెంట్ కరోనా వైరస్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
More Stories
పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్‌కు ఓటమి ఖాయం
ప్రశాంతంగా మూడో దశలో 64.58% పోలింగ్
ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని ముడతల దుస్తులే