దేశంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన్‌కీబాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం జాతినుద్దేశించి రేడియోలో ప్రసంగిస్తూ భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవ్ ’ అమృత ధారలు దేశ నలుమూలలా ప్రవహించాయని పేర్కొన్నారు.
పోషకాహార లోపాన్ని రూపు మాపడంలో సామాజిక అవగాహనే కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలందరూ ఈ ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. “పండగలతోపాటు ఈసారి సెప్టెంబర్ నెలను పోషకాహారంపై ప్రచారానికి అంకితం చేద్దాం. మనం సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు పోషణ్ మాహ్ (పోషకాహార మాసం) గా పాటిద్దాం ” అని ప్రధాని సూచించారు.
పోషకాహార నివారణకు చాలా సృజనాత్మక , విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. “పోషణ్ అభియాన్‌లో సాంకేతిక , ప్రజాభాగస్వామ్యాన్ని మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా కీలకం. భారత్‌లో పోషకాహార లోపాన్ని రూపుమాపడంతో జల్‌జీవన్ మిషన్ భారీగా ప్రభావం చూపనుంది” అని ప్రధాని వివరించారు.
భారత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమం ఘన విజయం సాధించిందని చెప్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అమృత స్వాతంత్ర్య మహోత్సవాలను ఇతర దేశాల్లో కూడా నిర్వహించారని తెలిపారు. పోషకాహార లోపాన్ని రూపుమాపటంలో సామాజిక అవగాహన కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న స్వరాజ్ సీరియల్‌ను చూడాలని ప్రజలను ప్రధాని కోరారు. స్వాతంత్ర్య సమర యోధుల జీవిత విశేషాలను, వారు చేసిన త్యాగాలను ఈ సీరియల్‌లో చూపిస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యోధుల కృషిని యువతరానికి తెలియజేయడానికి ఇదో గొప్ప ప్రయత్నమని ప్రదాని చెప్పారు. అమృత స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మన దేశ సమష్టి బలాన్ని మనం చూడగలిగామని తెలిపారు.
ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. చిరు వ్యాపారులు సైతం జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. అమృత సరోవరాల నిర్మాణం సామూహిక ఉద్యమంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రశంసనీయమైన కృషి జరుగుతోందని చెప్పారు.
మోదీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం 2014 అక్టోబరు 3న ప్రారంభమైంది. ప్రతి నెలా చివరి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని మోదీ కోరారు. ప్రజలు NaMo app ద్వారా కానీ, 1800-11-7800 నెంబరుకు ఫోన్ చేసి కానీ తమ అభిప్రాయాలను, సలహాలను తెలియజేయవచ్చు.

More Stories
రాజకీయాల్లో పదవీ విరమణ సాంకేతికం మాత్రమే
పశ్చిమాసియా నుంచి 2.44 లక్షల మంది భారతీయులు తరలింపు
సంక్షోభం ముగింపునకు చర్చలు, దౌత్యమే మార్గం