* విశ్వహిందూ పరిషత్ కేంద్ర నిర్వహణ కమిటీ నిర్ణయం
శ్రీ రామ జన్మభూమి ఉద్యమ ప్రధాన సూత్రధారి పూజ్య అశోక్ సింఘాల్ జీ శత జయంతిని ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుండి సంవత్సరం పొడవునా నిర్వహించాలని ఢిల్లీలో సోమవారం ముగిసిన విశ్వహిందూ పరిషత్ కేంద్ర నిర్వహణ కమిటీ రెండు రోజుల సమావేశంలో నిర్ణయించారు. హిందూ సమాజానికి ఆయన అందించిన అసమానమైన సేవలను ఏడాది పొడవునా ప్రజలకు తెలియజేయాలని ఈ సమావేశం తీర్మానించింది.
ఆయన శతజయంతి సంవత్సరంలో, సంస్థాగత విస్తరణకు విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక ప్రాధాన్యతనివ్వనుంది. రామమందిర ఉద్యమానికి బలమైన నాయకత్వం వహించడం, హిందూ చైతన్య ఉద్యమాలను నడపడం, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడంలో అశోక్ సింఘాల్ జీ పోషించిన పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
గోసంరక్షణ, గో-ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలను మరింత బలోపేతం చేయాలని పరిషత్ నిర్ణయించింది. భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంప్రదాయ పునరుద్ధరణ కేంద్రాలుగా వేద పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. అశోక్ సింఘాల్ జీ విశ్వ హిందూ పరిషత్‌ను ఒక బలమైన, మరియు ప్రభావవంతమైన సంస్థగా తీర్చిదిద్దారని సమావేశం గుర్తుచేసుకుంది. ఆయన దూరదృష్టితో కూడిన ఆలోచనలు,అవిశ్రాంత కృషి హిందూ సమాజంలో నూతన చైతన్యాన్ని, లక్ష్యశుద్ధిని నింపాయి.
కుటుంబ వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి
భారతీయ సమాజానికి మూలబలమైన కుటుంబ వ్యవస్థను రక్షించడం, బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించారు. శతాబ్దాలుగా భారతీయ కుటుంబ వ్యవస్థ సమాజాన్ని సంస్కారయుతంగా, వ్యవస్థీకృతంగా, పరస్పర అనురాగంతో కూడిన బంధంతో ఉంచిందని తీర్మానం పేర్కొంది. ప్రస్తుత కాలపు సవాళ్లకు సామాజిక, ప్రభుత్వ స్థాయిలలో గట్టి పరిష్కారాలు అవసరమని కూడా అది తెలిపింది.
వివాహేతర సంబంధాలకు గుర్తింపు, ‘లివ్-ఇన్’ సంబంధాలకు చట్టపరమైన హోదా, స్వలింగ సంపర్కానికి గుర్తింపు వంటి కొన్ని న్యాయపరమైన నిర్ణయాలు సాంప్రదాయ బలమైన కుటుంబ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయని తీర్మానం అభిప్రాయపడింది. కుటుంబ వ్యవస్థకు హాని కలగకుండా చట్టాలు రూపొందించేందుకు వీలుగా ఈ అంశాలపై సమగ్ర చర్చలు జరగాలని అది పిలుపునిచ్చింది. కుటుంబ విద్య, కుటుంబ విలువల పరిరక్షణ కోసం విస్తృత ప్రజా చైతన్య కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా పరిషత్ నిర్ణయించింది.
స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి
ఒడిశాలోని కంధమాల్‌లో పూజ్య స్వామి లక్ష్మణానంద సరస్వతి దారుణ హత్యపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక అదృశ్యం కావడం, దానిని బహిర్గతం చేయకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం కేసుపై సిబిఐ ద్వారా న్యాయమైన, నిష్పాక్షికమైన విచారణ జరగాలని కేంద్ర నిర్వహణ కమిటీ డిమాండ్ చేసింది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ అంశంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం న్యాయం, ప్రజల విశ్వాసం దృష్ట్యా అత్యవసరమని పరిషత్ పేర్కొంది. అలాగే, ఒడిశాలో మత మార్పిడులపై సంపూర్ణ నిషేధం విధించాలని కూడా అది డిమాండ్ చేసింది.
సంత్ శిరోమణి గురు రవిదాస్ జీ 650వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తీర్మానం ఆమోదించారు. సంత్ రవిదాస్ జీ అందించిన సామాజిక సామరస్యం, సమానత్వం, ఆధ్యాత్మిక చైతన్యం, మానవ గౌరవం వంటి సందేశాలు నేటికీ భారతీయ సమాజం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పరిషత్ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆయన సందేశాన్ని సమాజంలోని అన్ని వర్గాల వారికి చేరవేయాలని పరిషత్ నిర్ణయించింది.
కోటి మంది శ్రేయోభిలాషులు, మద్దతుదారులతో ఒక బలమైన వ్యవస్థను (నెట్‌వర్క్‌ను) నిర్మించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. హిందూ సమాజాన్ని ఏకం చేయడం, సనాతన విలువలను పరిరక్షించడం, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించడం అనే దృఢ సంకల్పంతో ఈ సమావేశం ముగిసింది.

More Stories
నీట్ అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు
రామమందిర విరాళాల కేసును రాజకీయం చేయవద్దు
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం