
పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పోటెత్తాయి. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 53.90అడుగులకు పెరిగింది. అధికారులు సోమవారం సాయంత్రానికే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరితో పాటు దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
భద్రాచలం వద్ద 14.54లక్షల వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు దిగువన నది సమీప ప్రాంతాల వారికి వరద హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గోదావరి నదీలో వరద ప్రవాహాలను ఎప్పకప్పుడు గమనిస్తూ పరివాహకంగా లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
సాదారణంగా గోదావరిలో జులై చివరి వారం నుంచి ఆగస్ట్‌లో వరద ప్రవాహాలు పుంజుకుంటాయి. అయితే జులై నెల రెండో వారంలోనే ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహాలు రావటం వందేళ్ల గోదావరి నది వరదల చరిత్రలో ఇదే ప్రథమం అని నీటిపారుదల రంగం నిపుణులు చెబుతున్నారు.
ఎగువన మహారాష్ట్రతోపాటు చత్తిస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా గోదావరితోపాటు దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీ వర్షలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి ప్రస్తుతం డ్యామ్‌కు 45,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 89,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మరో రెండ్రోజులపాటు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రెండు జిల్లాలో రాబోయే రెండ్రోజుల పాటు 11 నుంచి 20 సెంమీల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ 6 నుంచి 11 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సోమవారం సైతం గ్రేటర్ పరిధిలో ముసురు కొనసాగింది. అత్యధికంగా ఏఎస్ రావునగర్, కుత్బుల్లాపూర్‌లో 1.6 సెం.మీ వాన పడింది. మరో రెండు రోజులు వానలుంటాయని, పౌరులు ఏదైనా అత్యవసరమైతే బల్దియా కంట్రోల్ రూమ్ – 040–21111111 లేదా 040–29555500 నంబర్లకు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కూకట్‌పల్లి నాలా నుంచి వస్తున్న నీరు సైతం హుస్సేన్‌సాగర్‌లోకి చేరుతోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది. వస్తున్న నీటి ఇన్‌ఫ్లోకు… సమానంగా తూముల ద్వారా నీరు బయటకు వెళుతోంది.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. ఇందులో 29 జిల్లాల్లో అతి ఎక్కువ స్థాయిలో వానలు పడగా.. ఆదిలాబాద్, హైదరాబాద్, వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాలు మాత్రమే కాస్త ఎక్కువ వానల జాబితాలో ఉన్నాయి. సొమవారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
ముస్లింలు, ఆర్ఎస్ఎస్ : వ్యక్తిగత స్మృతులు
చిన్న పార్టీలే బీహార్ విజేత నిర్ణేతలు