రజాకార్‌ ఉద్యమ నేపథ్యంలో సినిమా

నిజాం పాలనలో తెలంగాణ ప్రజలపై దమణకాండ సాగించిన రజాకార్ల నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ వెల్లడించాయిరు. అయితే ఆ సినిమా పేరు ‘రజాకార్‌ ఫైల్స్‌’ కాదని ఆయన స్పష్టం చేశారు. ఆయనను గతవారమే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయడం గమనార్హం. 
 
‘‘నేను హిందీలో కథ అందించిన ‘బజరంగీ భాయిజాన్‌’ (2015) చిత్రం చూశారు కదా. అందులో హీరో ఆంజనేయ స్వామి భక్తుడు. పాకిస్థాన్‌ నుండి భారత్ కు వచ్చిన ఓ చిన్నపాప ఇక్కడ తప్పిపోతే,  హీరో ఆమెను  ఎలా తిరిగి తన  ఇంటికి చేర్చాడన్నదే ఆ చిత్రకథ. ఇందుకోసం ఆయన పాకిస్థాన్‌తో ఎలాంటి యుద్ధం చేయలేదు” అని గుర్తు చేశారు. 
 
అదే విధంగా, రజాకార్ల నేపథ్యంలో తాను చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుందని ఆయన వివరించారు. ‘‘మానసిక ఒత్తిడి ఉన్న చోట వేదన ఎక్కువగా ఉంటుంది. ఆ వేదనను అధిగమించి కూడా మానవత్వం చూపిస్తే  అది గుండెలకు హత్తుకుంటుంది. మంచి సినిమా అవుతుంది” అని తెలిపారు. 
 
ఈ ఆలోచనతో సినిమా పరంగా మంచి డ్రామా పండుతుందని ఆ నేపథ్యాన్ని ఎన్నుకున్నానని చెప్పారు. అంతే. సినిమా చూశాక జనం కళ్లనీళ్లతో బయటకు రావాలి. అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ లేదని విజయేంద్ర ప్రసాద్‌ స్పష్టం చేశారు. అన్నింటికన్నా మానవత్వమే గొప్పదని ఈ చిత్రం ద్వారా చెబుతామని పేర్కొన్నారు. 
 
ఈ సినిమా చేయాలని బీజేపీ నేతలు అడిగారన్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘‘నేను కథ తయారు చేస్తున్న సమయంలో వారు నన్ను కలవడం కాకతాళీయం. ఈ సినిమాకూ వారికీ సంబంధమే లేదు’’ అని వివరించారు.  ఈ సినిమాకకు నిర్మాతలు ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తానని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రానికి తాను కథ మాత్రమే అందిస్తానని, దర్శకత్వం చేయబోనని విజయేంద్రప్రసాద్‌ స్పష్టం చేశారు.
ఈయన రాసిన కథలకు జనాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. బాహుబలి, బజరంగీ భాయిజాన్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించగా, ఆ సినిమాలు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకున్నాయో అందరికీ తెలిసిందే.  ఇప్పటికే రజాకార్ల అరాచకంపై ఆయన గతంలో నాగార్జున హీరోగా ‘రాజన్న’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలో రజాకార్ల అన్యాయాలు, అక్రమాలను ఆయన మనకు చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.