నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన ప్రముఖులు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్డే, పి.టి.ఉష లకు నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారికి రాజ్యసభకు నామినేట్ చేసినందుకు ప్రధాని మోదీకి పవన్ అభినందనలు చెప్పారు.
“పెద్దల సభ అయిన రాజ్యసభకు ఇళయ రాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్డే, పి.టి.ఉష సభ్యులుగా నియమితులయ్యారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించింది. రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వీరికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను” అని తెలిపారు.
స్వర జ్ఞాని ఇళయరాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక సేవకులు వీరేంద్ర హెగ్డే, పరుగుల రాణి పి.టి.ఉష.. తమ రంగాల్లో మన దేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసిన స్రష్టలు వీరిని ఆయన కొనియాడారు. వీరి సేవలు, అనుభవాన్ని సముచిత రీతిన గుర్తించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర నాయకత్వానికి అభినందనలు తెలిపారు.
పదవులు ఇవ్వాలంటే రాజకీయంగా ఎంత లబ్ది కలుగుతుంది? ఎన్ని కోట్లు మన ఇంట్లోకి వచ్చి చేరుతాయి? అని కొన్ని పార్టీల అధినాయకులు లెక్కలు వేసుకుని ముక్కు ముఖం తెలియని వారికి పెద్ద పదవులు కట్టబెట్టడం జగమెరిగిన సత్యం అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇటువంటి ఈ కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

More Stories
ఐదో తరం విమానాలు గగనంలో ఎగరబోతున్నాయి
ఏపీలో వారానికి ఒకరోజు నో వెహికల్ డే
“డిజిటల్ భారత్ నిధి” పథకం కింద ఏజెన్సీ ప్రాంతాల్లో 5జీ సేవలు