అంతులేని టీఆర్‌ఎస్, మజ్లిస్‌ నేతల అరాచకాలు

అంతులేని టీఆర్‌ఎస్, మజ్లిస్‌ నేతల అరాచకాలు
జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని.. నిందితులు ఏ మూల దాగి ఉన్నా అరెస్ట్‌ చేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, మజ్లిస్‌ నేతల అరాచకాలు, అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. 
 
కొంత కాలంగా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అఘాయిత్యాలు జరిగినా అందులో టీఆర్‌ఎస్‌ నేతల హస్తం ఉంటోందని ఆయన ఆరోపించారు. మంథనిలో లాయర్‌ వామన్‌ రావు హత్య, కొత్తగూడెంలో వనమా రాఘవేంద్ర ఆగడాలకు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య, ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ నేతల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్యలను ఆయన ప్రస్తావించారు.
అదే విధంగా, సూర్యాపేట జిల్లా కోదాడలో పేదింటి ఆడబిడ్డపై టీఆర్‌ఎస్‌ నేతల గ్యాంగ్‌ రేప్, రామాయంపేటలో టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ వేధింపులు తాళలేక తల్లీ కొడుకు లాడ్జిలో ఆత్మహత్య, నిర్మల్‌లో బాలికపై టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అత్యాచారం వంటి సంఘటనలు కోకొల్లలని వివరించారు.
 
కాగా, సీఎం కేసీఆర్‌ పాలనలో టీఆర్‌ఎస్, మజ్లిస్‌ నాయకులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్‌ మండిపడ్డారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే భావనతో అధికారిక వాహనాలను అడ్డాగా చేసుకుని, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
 
మే 28న ఘటన జరిగితే, ఇంతవరకు  పూర్తి స్థాయిలో విచారణ జరపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, మజ్లిస్‌ పారీ్టలకు చెందిన ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్, ప్రముఖుల కుమారులు ఈ కేసులో ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలు, వీడియోల్లో స్పష్టంగా కన్పిస్తున్నా ఇంకా చర్యలు తీసుకోక పోవడమేమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.