ఏపీలో కొత్త జిల్లాలకు జగన్ ప్రభుత్వం శ్రీకారం

ఏపీలో కొత్త జిల్లాలకు జగన్ ప్రభుత్వం శ్రీకారం
రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం ఉదయం కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభంకానుంది. 
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అని తెలిపారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయని,  ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచినట్లు ప్రకటించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 
 
కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు జరుగనున్నట్లు చెప్పారు. 
 
నిన్నటి వరకు సగటు జిల్లా జనాభా 38.15 లక్షలు అని, ఇంతటి ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలు ఉన్నవి ఏపీలోనే అని తెలిపారు. ఇప్పుడు జిల్లా సగటు జనాభా 19.07 లక్షలు అని వెల్లడించారు. 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా జిల్లాల విభజన జరిగిందని చెప్పారు. రెవెన్యూ డివిజన్లను 51 నుంచి 72కు పెంచడం జరిగిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 
 
పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు అని మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్‌.. గతంలో ఉన్న జిల్లాలు యథాతధంగానే ఉంటాయని గుర్తు చేశారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని చెబుతూ.. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు.
 
దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకు ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదని,  సుమారు 4 కోట్ల 96 లక్షల మంది జనాభా ఉన్న ఏపీకి జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. ఇంతకు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని.. ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని తెలిపారు. 
 
గిరిజన జిల్లాల్లో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత.. ఉంటుందని చెప్పారాయన. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని, ఏరకంగా చూసుకున్నా ఇదే సరైన విధానమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రకాశం జిల్లా అత్యంత పెద్ద జిల్లాగా అవతరించింది. ఇది 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాష్ట్రంలో పెద్ద జిల్లాగా అవతరించగా.. విశాఖపట్నం అత్యంత చిన్నజిల్లాగా మారింది. పాత విశాఖపట్నం జిల్లా మూడు ముక్కలైంది. పాత విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను అనకాపల్లి జిల్లాగా, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేశారు.
 
 కేవలం నగర ప్రాంతంతో విశాఖపట్నం జిల్లా మిగిలింది. దీని విస్తీర్ణం 928 చదరపు కిలోమీటర్లుగా ఉంది. భౌగోళికంగా చిన్నదైన ఈ జిల్లాలో అసలు గ్రామీణ ప్రాంతమే లేకపోవడం మరో విశేషం. ఈ జిల్లా జనాభా మొత్తం 18.13 లక్షలు. మరోవైపు.. అత్యధిక జనాభా ఉన్న జిల్లా కర్నూలు. ఈ జిల్లాలో 23.66 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా అత్యంత తక్కువ జనాభా (9.54 లక్షలు) ఉన్నది అల్లూరి సీతారామరాజు జిల్లా.