గంగా ఎక్స్‌ప్రెస్ వేతో భారీగా ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు

గంగా ఎక్స్‌ప్రెస్ వేతో భారీగా ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు

గంగా ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు భారీగా ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెప్పారు. ఇవాళ షాజ‌హాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ప్ర‌ధాని శంకుస్థాప‌న చేస్తూ  సుమారు 600 కిలోమీట‌ర్ల పొడ‌వైన గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు.

గంగా ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాప‌న జ‌రుగడంతో ఆ ప్రాజెక్టు ప‌రిస‌ర ప్రాంతాలైన‌ మీర‌ట్, హాపూర్‌, బులంద్‌ష‌హ‌ర్‌, అమ్రోహ‌, సంభాల్‌, బ‌దౌన్‌, షాజ‌హాన్‌పూర్‌, హ‌ర్దోయ్‌, ఉన్న‌వ్‌, రాయ్‌బ‌రేలీ, ప్ర‌తాప్‌గ‌ఢ్‌, ప్ర‌యాగ్‌రాజ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని అభినంద‌న‌లు తెలియ‌జేశారు. 

గంగా ఎక్స్‌ప్రెస్ వే పూర్త‌యితే ప‌లు కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాట‌వుతాయ‌ని ఆయ‌న చెప్పారు. దాంతో స్థానిక యువ‌త‌కు భారీగా ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ప్రశంసలు కురిపిస్తూ యూపీ ప్లస్ యోగి ఉపయోగి అవుతుందంటూ చమత్కరించారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని, గొప్ప సదుపాయంగా ఉంటుందని తెలిపారు. వీటన్నిటి ఫలితంగా సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర వనరులు సద్వినియోగమవుతాయని చెప్పారు. 

 డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆధునిక మౌలిక సదుపాయాల వల్ల ఉత్తర ప్రదేశ్ త్వరలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు పొందుతుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. తదుపరి తరం మౌలిక సదుపాయాలతో అత్యాధునిక రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ గుర్తింపు పొందడం ఎంతో దూరంలో లేదని మోదీ చెప్పారు.

యూపీలోని ఎక్స్‌ప్రెస్ వేస్ నెట్‌వ‌ర్క్‌తో కొత్త ఎయిర్‌పోర్టులు, కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌జాధ‌నం గతంలో ఎలా దుర్వినియోగ‌మ‌య్యేదో అంద‌రూ చూశార‌ని, పాల‌కులు భారీ ప్రాజెక్టుల‌ను పేప‌ర్ల‌కు ప‌రిమితం చేసి సొంత ఖ‌జానా నింపుకునే వార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో నేడు ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతోందని, వనరులు ఏవిధంగా సద్వినియోగమవుతున్నాయో ప్రజలు చూస్తున్నారని చెప్పారు. 

ప్రస్తుతం ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితమవుతుంది. దీనిని 8 లేన్లకు విస్తరించవచ్చు. దీనిలో 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది. అత్యవసర సమయంలో భారత వాయు సేన విమానాలు ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి బయల్దేరడానికి అవకాశం ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఓ పారిశ్రామిక నడవను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.