ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ!

ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ!
స్వచ్ఛంద పదవీ విరమణ కోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా 26 ఏళ్లపాటు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. పదవీ విరమణపై ప్రభుత్వ కార్యదర్శికి లేఖ పంపినట్లు తెలిపారు.  1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్నారు.  అధికారి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా సేవలు అందించారు.

ప్రవీణ్‌ కుమార్‌పై ఇటీవల పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. తొమ్మిది సంవత్సరాల నుంచి స్వేరోస్ కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌ సేవలు అందించారు. అనివార్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయిల్ పంపారు.

ఈ నిర్ణయం బాధ కలిగించినా ఎట్టకేలకు ఎలాంటి పరిమితులు లేకుండా, తన మనసుకు నచ్చిన పనులు నచ్చిన రీతిలో చేయబోతున్నట్లు ప్రకటించారు. పదవీ విరమణ అనంతరం పీడిత వర్గాలకు అండగా ఉంటానని పేర్కొంటూ రాజకీయ కార్యక్రమాలు చేబట్టబోతున్నట్లు సంకేతం ఇచ్చారు.

కొన్ని రోజుల క్రితం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులు భీమ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ ఈయన సమక్షంలోనే జరిగింది. ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. హిందూ దేవతలను కించపరిచేలా  ఈ  ప్రతిజ్ఞ చేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. 

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో స్వేరోల కార్యకలాపాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్  గత మార్చ్ లో  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో స్వేరోల పేరిట ప్రయివేట్ వ్యక్తుల పెత్తనంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన ‘స్వేరోస్’ అనే ప్రయివేట్ సంస్థ ఆధ్వర్యంలో టెండర్ల విషయంలో అక్రమాలే కాకుండా అక్కడ విద్యనభ్యసిస్తున్న పిల్లలపై అన్యమత భవనాలు బలవంతంగా రుద్దుతున్న విషయం కూడా చాలా కాలంగా కూడా ప్రచారంలో ఉంది. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.

ఈ పాఠ‌శాల‌ల‌కు కార్య‌ద‌ర్శిగా ఐ.పి.ఎస్ అధికారి ప్ర‌వీణ్‌కుమార్ గ‌త 7సంవ‌త్స‌రాలుగా కొన‌సాగుతుండటం,  గురుకులాల కార్య‌ద‌ర్శిగా ఉంటూనే ప్రైవేటుగా స్వేరొస్ అనే ఒక సంస్థ‌ను ఏర్పాటు చేయడం, గురుకులాల అంతర్గత విషయాల్లో స్వేరోలు కలుగజేసుకుంటుండటం, పాఠశాలల్లో జాతీయగీతం స్థానంలో ప్రత్యేకంగా రూపొందించిన ‘స్వేరో గీతం’ పిల్లలతో ఆలాపన చేయడం వంటి విషయాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో ప్రస్తావించింది.