15 నుంచి భారత్‌లో మోడెర్నా టీకా

కొవిడ్19 నియంత్రణకు అమెరికా ఔషధ కంపెనీ మోడెర్నా రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఎ టీకాలు భారత్‌లోని ఆస్పత్రులకు జులై 15నుంచి అందుబాటులోకి వస్తాయని ఆరోగ్యశాఖ అధికారుల అంచనాగా చెబుతున్నారు.

ఇటీవలే మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డిసిజిఐ అనుమతి ఇచ్చింది. అనుమతి పొందిన భారత ఔషధ తయారీ సంస్థ సిప్లాకు ఓ షరతు విధించింది. టీకాలు పొందిన మొదటి 100 మంది లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని వారం రోజుల పాటు మదింపు చేయాలని ఆదేశించింది.

సురక్షితమని నిర్ధారించుకున్నాకే విస్తృత పంపిణీ చేపట్టాలని సూచించింది. ఇప్పటి వరకు మన దేశంలో వినియోగిస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు వెక్టర్ వ్యాక్సిన్లు కాగా, మోడెర్నా టీకా ఎంఆర్‌ఎన్‌ఎ టీకా అన్నది గమనార్హం. దీనిని ఇప్పటికే అమెరికా, యూరోపియన్ దేశాల్లో పంపిణీ చేస్తున్నారు. 

మైనస్ 20 డిగ్రీల కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయాల్సి ఉండటంతో ఈ టీకాల పంపిణీకి మన దేశంలో కొన్ని ఇబ్బందులున్నాయి. అంతేగాక ఈ టీకాల ధర అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ టీకాల ధరపై సిప్లా నుంచి ప్రకటన రాలేదు.

కాగా, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులలో లభ్యమవుతున్న రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ అతి త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా లభ్యం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి వెల్లడించారు. ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నదని తెలిపారు. ఇలా ఉండగా,  దేశంలో సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ టీకాలను ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందిస్తున్నారు.

కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ప్రభుత్వం స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నదని తెలిపారు. ఈ వ్యాక్సిన్ మరిన్ని డోసులు అందితే దేశంలో వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా జరుగుతుందన్నారు. కాగా దేశంలో ఇప్పటివరకూ 35 కోట్ల 26 లక్షల 92 వేల, 46 మందికి వ్యాక్సిన్ వేశారు.