శాస్త్రీయంగానే కొవిషీల్డ్‌ డోస్ ల మధ్య వ్యవధి పొడిగింపు 

శాస్త్రీయపరమైన సమాచారాన్ని విశ్లేషించిన అనంతరమే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెెండు డోసుల మధ్య వ్యవధిని పొడిగించామని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఇది పూర్తిగా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. 
 
కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్రం 12-16 వారాలకు పొడిగించడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. నిపుణుల సలహా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వమే ఏకపక్షంగా రెండు డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుండి 12-16 వారాలకు పొడిగించేందుకు సిఫారసు చేసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అలాగే వ్యాక్సిన్ల కొరత కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించాయి.
 
”కొవిషీల్డ్‌ డోసుల వ్యవధి పెంపుపై శాస్త్రీయ డేటా ఆధారంగా చాలా పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించడానికి భారత్‌కు చాలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. ఇలాంటి ముఖ్యమైన విషయాలను రాజకీయం చేయడం దురదృష్టకరం” అని హర్షవర్ధన్‌ ట్విటర్‌లో స్పష్టం చేశారు. డోసుల మధ్య వ్యవధి పెంపు అనేది పూర్తిగా శాస్త్రీయత ఆధారంగా తీసుకున్న నిర్ణయమేనని తెలిపారు. 
 
అలాగే నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌టిఎజిఐ) చైర్మన్‌ అరోరా స్టేట్‌మెంట్‌ను కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కొవిషీల్డ్‌ డోసుల వ్యవధిపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయని, ఒకవేళ భవిష్యత్తుల్లో వ్యవధి తగ్గించే అవకాశం కూడా లేకపోలేదని అరోరా పేర్కొన్నారు.
 
బ్రిట‌న్ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించిన డేటా ఆధారంగా కోవీషీల్డ్ టీకాల‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు డాక్ట‌ర్ అరోరా తెలిపారు. రెండు డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని 12 వారాల‌కు పెంచితే, అప్పుడు వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 65 శాతం నుంచి 88 శాతానికి పెరిగిన‌ట్లు చెప్పారు.  ఆల్ఫా వేరియంట్ ఉదృతంగా ఉన్న స‌మ‌యంలో బ్రిట‌న్ చేప‌ట్టిన స‌ర్వే వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. 
 
ఆ స‌మ‌యంలో టీకాల మ‌ధ్య వ్య‌వ‌ధిని 12 వారాల ఉంచ‌డం వ‌ల్ల ఆల్ఫా వేరియంట్‌ను సులువుగా ఎదుర్కొన్న‌ట్లు బ్రిట‌న్ త‌న స్ట‌డీలో తెలిపిందని పేర్కొన్నారు. ఆ ఐడియా బాగుంద‌ని, వ్య‌వ‌ధిని పెంచ‌డం వ‌ల్ల అడినోవెక్ట‌ర్ వ్యాక్సిన్ల ప్ర‌తిస్పంద‌న పెరుగుతంద‌ని గ్ర‌హించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రెండు డోసుల మ‌ధ్య గ్యాప్‌ను పెంచే అంశంలో కోవిడ్ వ‌ర్కింగ్ గ్రూపులో ఎటువంటి విభేదాలు త‌లెత్త‌లేద‌ని అరోరా స్పష్టం చేశారు.