ట్రాప్‌లోకి లాగి భద్రతా బలగాలను తుదముట్టించారా? 

ట్రాప్‌లోకి లాగి భద్రతా బలగాలను తుదముట్టించారా? 

మావోయిస్టులు ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే భ‌ద్ర‌తాసిబ్బందిపై దాడి చేశార‌ని సీఆర్‌పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఓ మావోయిస్టు అగ్రనేత ఉన్నాడని పోలీసులను ఉప్పందించి, ట్రాప్‌లోకి లాగి భద్రతా బలగాలను తుదముట్టించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

భద్ర‌తాబ‌ల‌గాలు కూంబింగ్ ఆప‌రేష‌న్‌కు వ‌స్తున్న సంగ‌తి తెలుసుకున్న‌ మావోయిస్టులు లైట్ మెషిన్ గ‌న్‌లు, అండ‌ర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచ‌ర్స్‌, దేశీ రాకెట్ల‌ను సిద్ధం చేసుకుని సుర‌క్షిత ప్రాంతంలో దాగి ఉన్నార‌ని, బ‌లగాలు మొత్తం వాళ్లు ప్లాన్ చేసిన ప్ర‌దేశంలోకి వ‌చ్చేదాకా ఎదురుచూసి ఒక్క‌సారిగా అన్నివైపుల నుంచి దాడికి పాల్ప‌డ్డార‌ని వెల్ల‌డించారు.

శ‌నివారం రాత్రి సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల‌తోపాటు యాంటీ మావోయిస్ట్ క‌మాండో బెటాలియ‌న్ ఫ‌ర్ రిజ‌ల్యూట్ యాక్ష‌న్ (కోబ్రా)  యూనిట్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్ గ్రూప్, స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టిఎఫ్) విభాగాల‌కు చెందిన మొత్తం 400 మంది భ‌ద్ర‌తాసిబ్బంది సుక్మా-బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దుల్లోని అట‌వీ ప్రాంతంలో కూంబింగ్ ఆప‌రేష‌న్‌కు వెళ్లిన‌ట్లు సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.

ఈ స‌మాచారాన్ని ముందే తెలుసుకున్న మావోయిస్టులు త‌మ‌కు అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని, అక్క‌డికి బ‌ల‌గాలు పూర్తిగా చేరుకోగానే దాడికి పాల్ప‌డ్డార‌ని సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ చెప్పారు. మొత్తం 350 మంది సాయుధులైన సీపీఐ మావోయిస్టులు, వారి సానుభూతిప‌రులైన మ‌రో 250 మంది జ‌న్ మిలిషియా భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

అయితే, మావోల దాడిని బ‌ల‌గాలు తీవ్రంగా ప్ర‌తిఘ‌టించాయ‌ని, మావోయిస్టుల వైపుకు కూడా భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగింద‌ని చెప్పారు.మావోయిస్టులు త‌మ‌వైపు నుంచి మృతిచెందిన‌, గాయ‌ప‌డిన వారినంద‌రినీ క‌లిపి మూడు ట్రాక్ట‌ర్ల‌లో వేసుకెళ్లిన‌ట్లు ఈ కూంబింగ్ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న జ‌వాన్లు చెబుతున్నార‌ని, దాన్నిబ‌ట్టి మావోయిస్టుల వైపుకు కూడా భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ద‌ని కుల్దీప్‌సింగ్ పేర్కొన్నారు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో శ‌నివారం భ‌ద్ర‌తాబల‌గాలపై దాడికి పాల్ప‌డిన మావోయిస్టులు వారి చేతికి చిక్కిన జ‌వాన్ల‌ను అత్యంత కిరాత‌కంగా చంపేశార‌ని సీఆర్‌పీఎఫ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వారు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఒక జ‌వాన్‌ను చంప‌డానికి ముందు అత‌ని చేతిని న‌రికేసి హింసించారు. అదేవిధంగా మ‌ర‌ణించిన జ‌వాన్ల నుంచి ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్ల‌ను కూడా ఎత్తుకెళ్లారు.

మావోయిస్టు అగ్రనేత ‘హిడ్మా’ ఇక్కడి అడవుల్లోనే దాక్కున్నాడంటూ మావోయిస్టులు ఓ పుకారును సృష్టించారు. ఈయనపై 25 లక్షల రివార్డు కూడా ఉంది. దీంతో భద్రతా బలగాలు మావోయిస్టులు సృష్టించిన ఈ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్న చోటే మావోయిస్టులు కాచుకు కూర్చున్నారని, అదును దొరకడమే తరువాయి విజృంభించారని భావిస్తున్నారు.

ఇక మరికొందరు భద్రతా బలగాలు ‘డీహైడ్రేషన్’ తో కూడా మరణించినట్లు తెలుస్తోంది. అడవుల్లో గాలింపు చర్యలు అధికమైన నేపథ్యంలో ఆహారపు పొట్లాలను, వాటర్ బాటిల్స్‌ను అధికంగా మోయలేదని, సరైన సమయంలో వారికి నీరు, ఆహారం అందుబాటులో లేకపోవడంతో కూడా మరణించి ఉంటారని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.