ఐరాస సంస్కరణల ప్రక్రియ జాప్యంపై భారత్ అసహనం 

అనేక దశాబ్దాల నుంచి ఐక్య రాజ్య సమితి (ఐరాస) సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం,  వివిధ దేశాల మధ్య చర్చలు ఆలస్యం కావడంపై భారత్  అసహనం వ్యక్తం చేసింది. ఐరాస, భద్రతా మండలి మరింత కలుపుగోలుగా ఉండాలని, సమకాలిక సవాళ్లను ఎదుర్కొనగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలని, అందుకు దోహదపడేవిధంగా విశాల, పారదర్శక వైఖరిని ప్రదర్శించాలని పిలుపునిచ్చింది.

భద్రతా మండలి సభ్యత్వాల పెంపు, న్యాయమైన, నిష్పాక్షికమైన ప్రాతినిధ్యాన్ని కల్పించడంపై జరిగిన సమావేశంలో ఐక్య రాజ్య సమితికి భారత దేశ రాయబారి టీఎస్ తిరుమూర్తి పాల్గొంటూ ఐరాస సంస్కరణలను అడ్డుకుంటున్నవారిని ఘాటుగా విమర్శించారు. ఐరాస సంస్కరణలు ఓ ప్రక్రియ అని, ఓ కార్యక్రమం కాదని మనందరికీ తెలుసునని పేర్కొన్నారు. 

భద్రతా మండలి సంస్కరణల ప్రక్రియ కన్నా ఎక్కువ మెలికలు తిరిగిన బాటలో ప్రయాణించిన ప్రక్రియ ఐరాసలో మరొకటి ఏదీ లేదని ఆరోపించారు. భద్రతా మండలిని సంస్కరించాలనే ప్రతిపాదనను 43 ఏళ్ల క్రితం ఈ మండలిలో ప్రవేశపెట్టారని, 13 ఏళ్ల క్రితం ఇంటర్ గవర్నమెంటల్ చర్చలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. 

ఈ ప్రక్రియను ప్రారంభించినపుడు ఉన్నట్లుగా ప్రపంచం ఇప్పుడు లేదని గుర్తు చేశారు. ముందుకెళ్ళడానికి అభ్యంతరాలు సమయంతోపాటు దృఢంగా మారాయని చెప్పారు. 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లు అనేక రెట్లు పెరుగుతున్నాయని, ముందుకు వెళ్ళడానికి వీలుగా ప్రక్రియను ప్రారంభించడాన్ని సైతం కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

ఐరాస సంస్కరణలపై ఉదాసీనత వల్ల నష్టం లేకపోలేదని హెచ్చరించారు. అంతర్జాతీయ శాంతి, భ్రదతలకు సంబంధించిన సంక్లిష్ట సమస్యలను భద్రతా మండలి పరిష్కరించవలసి ఉంటుందని, అయితే దానిలో ఉండవలసినవారు లేకపోవడంతో సమ్మిళితత్వం లోపించిందని, అందువల్ల సమగ్రంగా పని చేయలేకపోతోందని చెప్పుకొచ్చారు. 

ఇంటర్ గవర్నమెంటల్ చర్చలు ఏమైనప్పటికీ అవి చర్చలేనని తెలిపారు. అయితే ఇచ్చి పుచ్చుకునే పారదర్శక చర్చల కోసం ప్రాతిపదికను రూపొందించగలిగే లిఖితపూర్వక డాక్యుమెంటేషన్ జరగడం లేదని పేర్కొన్నారు. సంస్కరణలను అడ్డుకునేవారికి ఉపయోగపడే తెరగా ఇంటర్ గవర్నమెంటల్ చర్చలు మారడానికి ఐరాస అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

మార్పులు చేయడంలో విఫలమైతే, దేశాలు నిజమైన సంస్కరణల కోసం ఈ చర్చలకు బయట చూడవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాలు సమకాలిక వాస్తవాలను ప్రతిబింబించాలని, అన్ని ప్రాంతాలకు తగినంత ప్రాతినిధ్యాన్ని కల్పించాలని స్పష్టం చేశారు.

కొత్తగా ఆరు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న భారత దేశ పిలుపును మరోసారి పునరుద్ఘాటించారు. ఆఫ్రికా దేశాల్లో రెండింటికి, ఆసియా దేశాల్లో రెండింటికి, లాటిన్ అమెరికా, కరీబియన్‌కు ఒకటి, వెస్ట్ యూరోపియన్, ఇతర గ్రూప్‌కు ఒకటి శాశ్వత సభ్యత్వాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ శాశ్వత సభ్య దేశాలు. భారత దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.