పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ సహా సుమారు 70 ఉగ్రవాద సంస్థలకు చెందిన 63 మిలియన్ డాలర్ల నిధులను స్తంభింపజేసింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలను తెలిపింది.
2019లో లష్కరే తొయిబాకు చెందిన 3,42,000 డాలర్లు; జైషే మహమ్మద్‌కు చెందిన 1,725 డాలర్లు; హర్కతుల్ ముజాహిదీన్ అల్ ఇస్లామీకి చెందిన 45,798 డాలర్లు స్తంభింపజేసినట్లు గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో తెలిపింది. ఈ మూడు సంస్థలు పాకిస్థాన్ కేంద్రంగానే పని చేస్తున్న సంగతి తెలిసిందే.
కశ్మీరులో విధ్వంసం లక్ష్యంగా పని చేస్తున్న మరొక పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన 4,321 డాలర్లను అమెరికా బ్లాక్ చేసింది. తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన 5,067 డాలర్లను కూడా స్తంభింపజేసింది.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల ఆస్తులపై ఆంక్షలను అమలు చేసే బాధ్యతను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీకి చెందిన ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ఆఫీస్ నిర్వహిస్తుంది. అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాల ఆధారంగా రూపొందించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను ఈ శాఖ అమలు చేస్తుంది.
తాజా నివేదిక ప్రకారం, 2019లో దాదాపు 70 డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు చెందిన 63 మిలియన్ డాలర్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 3.9 మిలియన్ డాలర్లు, హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన 26,546 డాలర్ల నిధులను కూడా స్తంభింపజేసింది. శ్రీలంకలోని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)కి చెందిన 5,80,811 డాలర్లను బ్లాక్ చేసింది.

More Stories
లష్కరే వ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై కాల్పులు
ఇరాన్ సుసంపన్నం యురేనియం పరిష్కారంకు రష్యా సిద్ధం
అమెరికా- ఇరాన్ యుద్ధానికి త్వరలోనే ముగింపు