కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో రాబోయే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.4 కోట్ల నాలెడ్జ్ వర్కర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వెల్త్ మేనేజ్మెంట్ నివేదిక అంచనా వేసింది. కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న పనులను ఏఐతో చేయించేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇది ఒక అంచనా ఆధారంగా రూపొందించిన పరిస్థితి మాత్రమేనని స్పష్టం చేసింది.
సంస్థలు ఏఐపై పెట్టే ఖర్చులో సగం మేరకు ప్రస్తుతం ఉద్యోగులతో చేయిస్తున్న పనులను భర్తీ చేసేందుకు వినియోగిస్తాయని, ఉద్యోగికి అయ్యే ఖర్చుతో పోలిస్తే, ఏఐ వినియోగ వ్యయం సగం ఉంటుందని భావించిన సందర్భంలో ఈ అంచనాకు వచ్చినట్టు నివేదిక వివరించింది. దీని ప్రకారం ఐదేళ్ల పాటు ఏటా ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 1.3 శాతం మందిపై ప్రభావం పడవచ్చు.
అయితే ఈ మార్పు అంతా ఉద్యోగులను తొలగించడం రూపంలోనే ఉండకపోవచ్చని జేపీ మోర్గాన్ పేర్కొంది. ‘‘చాలా వరకు ఏఐ ప్రభావం కొత్త ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఖాళీలను అలాగే ఉంచడం ద్వారా కనిపించవచ్చు’’ అని నివేదిక వివరించింది. కొన్ని నిర్దిష్ట ఉద్యోగ రంగాలు లేదా ప్రాంతాల్లోనే ఉద్యోగ నష్టాలు ఎక్కువగా కేంద్రీకృతమైతే ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
అమెరికాలో 1.6 కోట్ల మందిపై ప్రభావం?
ఈ పరిణామం అమెరికాపైనా గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ఉద్యోగాలు కోల్పోయే వారిలో మూడింట రెండొంతుల మంది అమెరికాలోనే ఉంటే, ఐదేళ్లలో సుమారు 1.6 కోట్ల మందిపై ప్రభావం పడవచ్చని పేర్కొంది. అంటే ఏటా సుమారు 30 లక్షల మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఇది అమెరికాలో ప్రతి ఏడాది మొత్తం ఉద్యోగాల్లో సుమారు 2 శాతానికి సమానమని నివేదిక వివరించింది. 2000వ దశకంలో తయారీ రంగంలో నమోదైన ఉద్యోగ నష్టాల వేగంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లకుపైగా ఉంటుందని పేర్కొంది. గ్రేట్ రిసెషన్ సమయంలో నమోదైన ఉద్యోగ నష్టాల స్థాయికి ఇది దగ్గరగా ఉండవచ్చని, అయితే అప్పటిలా రెండేళ్లలో కాకుండా ఐదేళ్ల పాటు ఈ ప్రభావం కొనసాగవచ్చని అంచనా వేసింది.
అయితే ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవడం కంటే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో పనుల స్వరూపం మారడమే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. ‘‘ప్రతి ఉద్యోగం అనేది అనేక పనుల సమాహారం. ఇప్పటివరకు ఏఐ వాటిలో కొన్నింటిని మాత్రమే ఆటోమేట్ చేయగలదు లేదా ఉద్యోగుల పనితీరును మెరుగుపరచగలదు’’ అని నివేదిక పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఏఐ వినియోగం విస్తరించడానికి సమయం పడుతుందని తెలిపింది. ఈ ప్రక్రియ ఒకే వేగంతో కాకుండా నెమ్మదిగా, అసమానంగా సాగుతుందని పేర్కొంది. దీనివల్ల ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కొంత తగ్గవచ్చని వివరించింది.
అమెరికాలో ప్రస్తుతం మొత్తం పనిగంటల్లో కేవలం 6 శాతం మాత్రమే ఏఐ సాయంతో జరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది. అయితే సిద్ధాంతపరంగా చూస్తే ఉద్యోగాల్లోని పనుల్లో మూడింట రెండొంతులు ఏఐ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ సాంకేతికత వినియోగం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొంది.
ఏఐపై పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వాలంటే టెక్నాలజీ రంగానికే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోనూ దాని వినియోగం పెరగాలని జేపీ మోర్గాన్ సూచించింది. కంపెనీలు ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, ఉత్పాదకత పెంచేందుకు ఏఐని తమ రోజువారీ కార్యకలాపాల్లో విస్తృతంగా ఉపయోగించాలని నివేదిక పేర్కొంది.

More Stories
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతుపై భరోసా!
కొలీజియం సిఫార్సులు ఓ నిర్దిష్టవర్గంకే అనుకూలం
డ్రగ్స్‌కు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు