తమిళనాడులో పురుష ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులు

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వివాహిత పురుష ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త నిబంధన ప్రకారం పురుష ప్రభుత్వ ఉద్యోగులు తమకు బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందు నుంచి లేదా శిశువు జన్మించిన ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఈ 15 రోజుల సెలవును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. 
 
కొత్తగా తండ్రులైన ఉద్యోగులు తమ కుటుంబంతో విలువైన సమయాన్ని గడపడానికి, ఆ సున్నితమైన సమయంలో భార్యకు అన్ని విధాలా తోడుగా నిలవడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనుంది. తమకు కూడా పితృత్వ సెలవులు కల్పించాలంటూ పురుష ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నుంచి ప్రభుత్వానికి గత కొంతకాలంగా పలు విజ్ఞప్తులు అందుతున్నాయి. వీటిని సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్ సర్కార్ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ప్రసవానికి ముందు, ఆ తర్వాతి సమయం తల్లితో పాటు నవజాత శిశువుకు ఎంతో కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ సమయంలో తల్లికి శారీరకంగా, మానసికంగా అండగా ఉండటంతో పాటు పసిబిడ్డ సంరక్షణలో తండ్రి పాత్ర కూడా అత్యంత ముఖ్యమని ప్రభుత్వం అభిప్రాయపడింది. తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఏడాది పాటు అంటే 365 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం అమల్లో ఉంది. 
 
తాజాగా పురుష ఉద్యోగులకు కూడా 15 రోజుల పితృత్వ సెలవులు ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మరింత అదనపు వెసులుబాటు కలగనుంది. సీఎం విజయ్ తీసుకున్న ఈ కుటుంబ స్నేహపూర్వక నిర్ణయంపై ఉద్యోగ వర్గాల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

About The Author