ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్‌సభను ఈ నెల (నవంబర్) 30న, రాజ్యసభను వచ్చే నెల (డిసెంబర్) 3న సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సమావేశాలు డిసెంబర్ మూడో తేదీ వరకు ఉంటాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వ అత్యవసర కార్యకలాపాల కోసం ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సమావేశాలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్ బిల్లులకు అవకాశం ఉండదని వారిద్దరూ తెలిపారు.
2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు (జమిలి) రెండింటికీ పార్లమెంటరీ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యచరణను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా పార్లమెంటును సమావేశపరిచి డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును ఆమోదింపజేయడానికి ఎన్డీయే కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల ఆమోదం దిశగా బీజేపీ కసరత్తులు చేస్తోందనే ఊహాగానాల నడుమ కిరణ్ రిజిజు ఈ ప్రకటన చేశారు. అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను కిరణ్ రిజిజు వెల్లడించలేదు.
అయినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసమే కేంద్రం ఈ సమావేశాలను ప్రారంభించబోతోందని సమాచారం. కాగా మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు-2026ను ఏప్రిల్ 17న కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే అవసరమైన మద్దతును కూడగట్టడంలో కేంద్రం విఫలం కావడంతో ఆ బిల్లు వీగిపోయింది.
దీంతో ఈ ప్రతిపాదనలను మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.పార్లమెంటు ఉభయసభలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదాపడ్డాయి. అయినప్పటికీ పార్లమెంటును ఇప్పటివరకు ప్రోరోగ్ చేయలేదు.ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడి 100 రోజులు దాటినా పార్లమెంటును ప్రోరోగ్ చేయకపోవడం ఓ రికార్డుగా నిలిచింది.
2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికోసం మోదీ సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోంది.

More Stories
తమిళనాడులో పురుష ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులు
ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై స్పష్టంగా పోషకాహార వివరాలు
పాక్ నుండి ఉగ్రవాదంలో కాశ్మీర్ నుండి పారిపోయిన 30 మంది