గత ఏడాది పహల్గామ్ మారణకాండలో పాల్గొన్న ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న, అమెరికాలో తయారైన గోప్రో కెమెరాకు సంబంధించిన సమాచారం కోసం భారత్ చేసిన అభ్యర్థనకు చైనా ఇంకా స్పందించలేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ రాకేష్ అగర్వాల్ తెలిపారు. దర్యాప్తు అధికారులు ఆ పరికరానికి సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారని, దాని మూలాలు, సరఫరా గొలుసును పరిశీలించడం కొనసాగిస్తున్నారని ఆయన ధృవీకరించారు.
2025 జూలైలో జమ్మూ కాశ్మీర్‌లోని దచీగామ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన తర్వాత స్వాధీనం చేసుకున్న ఈ కెమెరా, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా (ఎల్ఈటీ)కు పరికరాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై దర్యాప్తునకు ఒక కొత్త కోణాన్ని తెరిచింది. వాస్తవానికి చైనాలోని ఒక అధీకృత వాణిజ్య పంపిణీదారునికి పంపిన ఈ పరికరం చివరికి ఉగ్రవాదుల వద్దకు ఎలా చేరిందో నిర్ధారించడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఆ కెమెరాకు సంబంధించి చైనా అధికారుల నుంచి స్పందన కోసం తమ ఏజెన్సీ ఇంకా ఎదురుచూస్తోందని అగర్వాల్ తెలిపారు. ఆ పరికరం గురించి చైనా భారత్‌తో సంప్రదించిందా అని అడిగినప్పుడు, “మాకు ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. కానీ మా వద్ద కొన్ని ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయి,” అని ఆయన అన్నారు. దర్యాప్తులో భాగంగా, కెమెరా మూలాన్ని గుర్తించడానికి, అది ఎక్కడ అమ్మబడిందో నిర్ధారించడానికి ఎన్ఐఏ అమెరికాకు చెందిన తయారీ సంస్థ గోప్రో ఇంక్‌ను సంప్రదించింది” అని తెలిపారు.
“దర్యాప్తుతో పరిచయం ఉన్న అధికారుల ప్రకారం, ఆ నిర్దిష్ట పరికరాన్ని మొదట చైనాలోని ఒక అధీకృత వాణిజ్య పంపిణీదారునికి పంపినట్లు ఆ సంస్థ ఏజెన్సీకి తెలియజేసింది. చైనా పంపిణీదారుడి నుండి లష్కరే తోబే హ్యాండ్లర్లకు కెమెరా ఎలా చేరిందో దర్యాప్తు అధికారులు ఇప్పుడు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరికరాలను పాకిస్తాన్ సైన్యం సేకరించి, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులకు సరఫరా చేసి ఉండవచ్చనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు” అని చెప్పారు.
భారత్‌కు చైనాతో పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్ఏటి) లేనందున, ఇటువంటి కేసులలో సమాచారం కోసం అభ్యర్థనలను దౌత్య మార్గాల ద్వారానే కొనసాగిస్తున్నారు. ఈ అత్యాధునిక కెమెరాను స్వాధీనం చేసుకోవడం, జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్న పరికరాలు, లాజిస్టికల్ నెట్‌వర్క్‌లపై దృష్టిని ఆకర్షించింది.
కేంద్రపాలిత ప్రాంతంలోని ఉగ్రవాద బృందాలు, ఆకస్మిక దాడులను రికార్డ్ చేయడానికి శరీరానికి అమర్చుకునే (బాడీ-వోర్న్) వ్యూహాత్మక కెమెరాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయని, వీటిని తదనంతరం ప్రచారం, మానసిక యుద్ధం కోసం వాడుకోవచ్చని అధికారులు తెలిపారు.
భారత్ వ్యతిరేక ఉగ్రవాద గ్రూపులకు సరిహద్దుల గుండా నిధులు, హార్డ్‌వేర్ , వ్యూహాత్మక పరికరాలను తరలించే రహస్య నెట్‌వర్క్‌లలోని బలహీనతలను లేదా సాధ్యమయ్యే కుట్రను వెలికితీయడానికి, సరఫరా గొలుసును గుర్తించడం సహాయపడుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అందువల్ల, ఎన్ఐఏ కేవలం కెమెరా మొదట అమ్మిన ప్రదేశాన్నే కాకుండా, అది ఉగ్రవాదుల వద్దకు చేరిన మార్గాన్ని కూడా పరిశీలిస్తోంది.

More Stories
ఫోటో సెషన్లు, వాగ్దానాలకు పరిమితమైన త్రైపాక్షిక శిఖరాగ్ర భేటీ
ప్రపంచ శాంతికి సాంస్కృతిక సామరస్యమే పునాది
పాకిస్థాన్‌లో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై రాజకీయ ప్రకంపనలు