రేవంత్ రెడ్డి పాలనలో పంచాయతీ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు పైసలు లేనిదే ఫైలు కదలడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాదిరిగా కొట్లాడాల్సి వస్తున్నదని, ఇది సిగ్గుచేటు అని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధిలో కొంత వెనుకబడిందని చెప్పారు.
ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలోని కురుమ సంఘానికి చెందిన శ్రీబీరప్ప గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభిస్తూ కురుమ సంఘాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమాజంలో మంచితనాన్ని ఓర్చుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టే నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని పేర్కొంటూ నిన్న మొన్న కొత్త బిచ్చగాళ్లు వచ్చి షో చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెల్టుషాపులను నిర్మూలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, కానీ నిర్మూలించలేకపోయిందని దుయ్యబట్టారు. మునుగోడు నియోజకవర్గంలో మాత్రమే బెల్ట్‌షాపులను నిర్మూలిస్తున్నామని చెప్పారు.
తనను ఎవరూ ప్రలోభ పెట్టలేరని స్పష్టం చేస్తూ ‘రాజకీయాలు మారాలి. నాయకులు మారాలి. వ్యవస్థ మారాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంద’ని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, ప్రభుత్వం వచ్చి మూడేైండ్లెనా పదవి ఇవ్వలేదని అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఓపిక పట్టుకొని ఉన్నానని, కనీసం అభివృద్ధికి నిధులు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ‘రైతుబంధు గురించి ఊర్లల్లో అడుగుతున్నారు. హామీ ఇచ్చిన ఆయన బాగానే ఉన్నడు. రైతులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

More Stories
హైదరాబాద్ లో ఆందోళనకర స్థాయిలో శబ్ద కాలుష్యం
హరీష్‌రావుపై మరో ఫోన్ ట్యాపింగ్ కేసు
దేశం, ధర్మం కోసం మహిళలు కర్తవ్యనిష్ఠతో పని చేయాలి