జామియాలో  “ఫ్రీ కాశ్మీర్”, “ఫ్రీ షర్జీల్ ఇమామ్”  పట్ల దుమారం 

జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్ గోడలపై అభ్యంతరకరమైన గ్రాఫిటీని ఖండించింది. విధ్వంసకాండలు, “ఫ్రీ కాశ్మీర్”, “ఫ్రీ షర్జీల్ ఇమామ్” వంటి అత్యంత అభ్యంతరకరమైన నినాదాలు రాయడంపై జామియా అధ్యాపక సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు విద్యా వాతావరణాన్ని దెబ్బ,తీస్తాయని, సంస్థ మసకబారుస్తాయని వారు పేర్కొన్నారు.
 
భవిష్యత్ కార్యాచరణను చర్చించడానికి శనివారం జరిగిన ఈ సమావేశంలో జామియాకు చెందిన 1,500 మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ మజార్ ఆసిఫ్, రిజిస్ట్రార్ పాల్గొన్నారు. నాలుగు విడతల చర్చల అనంతరం, విద్యార్థులు తమ నిరసనను విరమించుకోవాలని కమిటీ నిన్న రాత్రి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ సమావేశం జరిగింది. 
 
క్యాంపస్ గోడలపై ఉన్న అభ్యంతరకరమైన గ్రాఫిటీ దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తుందని, విశ్వవిద్యాలయం ప్రతిష్టను దెబ్బతీస్తుందని జామియా వీసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఇలాంటి అభ్యంతరకరమైన నినాదాలు విద్యార్థుల విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. దీనివల్ల వారి భవిష్యత్ ఉద్యోగ, ప్లేస్‌మెంట్ అవకాశాలతో పాటు ఉన్నత విద్య అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు,” అని వీసీ హెచ్చరించారు. 
 
విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో, తరగతులను ఆన్‌లైన్‌కు మార్చనున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. విద్యార్థుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించేందుకు ముందుజాగ్రత్త చర్యగా తరగతులను ఆన్‌లైన్‌కు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. 
 
విశ్వవిద్యాలయం ఒక నోటిఫికేషన్‌లో ఇలా పేర్కొంది: “డీన్‌లు/హెడ్‌లు/డైరెక్టర్లు, అధ్యాపక సభ్యులు, అలాగే నిజమైన విద్యార్థులందరూ ఆన్‌లైన్ తరగతుల షెడ్యూల్‌కు కట్టుబడి, విద్యా కార్యకలాపాలలో క్రమం తప్పకుండా పాల్గొనేలా చూడాలని ఇందుమూలంగా ఆదేశిస్తున్నాము. అధ్యాపక సభ్యులందరూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తరగతులు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు అవసరమైన విద్యా సహాయం, అభ్యసన సామగ్రిని అందించాలని కోరుతున్నాము.” 
 
విద్యార్థి సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేయడంతో అక్టోబర్ 12న జామియాలో ఈ ఆందోళన ప్రారంభమైంది. చివరి ఎన్నికలు 2005లో జరిగాయి. 2006లో యూనియన్ ను రద్దు చేశారు. ఎన్నికల ద్వారా సభ్యులు ఎన్నికయ్యే విద్యార్థి సంఘాన్ని పునరుద్ధరించడమే తమ ప్రధాన డిమాండ్ అని నిరసన చేస్తున్న విద్యార్థులు నొక్కిచెప్పగా, కొత్త యూనియన్ రాజ్యాంగాన్ని రూపొందించడానికి విశ్వవిద్యాలయ పరిపాలన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 
 
గేట్ నెం 7 సమీపంలోని గాలిబ్ లాన్ నుండి ప్రదర్శనకారులను తొలగించడానికి అధికారులు ప్రయత్నించడంతో, అక్టోబర్ 17న ఈ నిరసనలో అశాంతి చెలరేగింది. అప్పటి నుండి పలు విద్యార్థి సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి. ఈ పరిణామాల మధ్య, క్యాంపస్ గోడలపై రాసిన “వీసీ గో బ్యాక్” వంటి నినాదాలను విశ్వవిద్యాలయ పరిపాలన ఖండించింది. బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. 
 
ఈలోగా, నినాదాలు కనిపించిన ప్రాంతాలలో కొన్ని సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని, వాటి వైరింగ్‌ను డిస్‌కనెక్ట్ చేశారని లేదా పాడుచేశారని అధికారులు తెలిపారు. విభాగాలు, కేంద్రాలలోకి ప్రవేశించడానికి ముందు విద్యార్థులను తనిఖీ చేయడంతో, క్యాంపస్ భద్రతను కట్టుదిట్టం చేశామని అధికారులు చెప్పారు. 
 
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం గోడలపై వివాదాస్పద నినాదాలు కనిపించడంతో, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ప్రారంభించారు. కాశ్మీర్, ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రస్తావించిన ఈ అభ్యంతరకర నినాదాల కారణంగా, విశ్వవిద్యాలయ పరిపాలన వాటిని తొలగించి, విచారణకు ఆదేశించింది.
 
 కాగా, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, ఇమ్రాన్ మసూద్ గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించి, అక్కడి వాతావరణాన్ని అశాంతికి గురిచేసిన మరుసటి రోజే ఈ ఘటన జరిగిందని జమియా రిజిస్ట్రార్ మెహతాబ్ ఆలం రిజ్వీ ఆరోపించారు. వారు విద్యార్థులను రెచ్చగొట్టి, తమ రాజకీయ ఎజెండాల కోసం వారిని పావులుగా వాడుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిజ్వీ తెలిపారు.


విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ ఎక్స్ లో ఓ పోస్ట్ లో “దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జామియా విశ్వవిద్యాలయంలో ‘ఫ్రీ కాశ్మీర్’, ‘ఫ్రీ పాలస్తీనా’, ‘ఫ్రీ షర్జీల్ ఇమామ్’, ‘వీసీ గో బ్యాక్’, ‘ఆర్ఎస్‌ఎస్ గో బ్యాక్’ వంటి నినాదాలు కనిపించడం అత్యంత దురదృష్టకరం. ఇది విద్యా దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిగిన లోతైన కుట్రకు నిదర్శనం” అని పేర్కొన్నారు. దీనికి రాజకీయ రంగు పులుముతూ, కొందరు వ్యక్తులు ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని “భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా” మార్చడానికి ప్రయత్నిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

About The Author