సౌదీ అరేబియాపై హౌతీల కొత్త ప్రచార అస్త్రం ఎప్‌స్టీన్ ఫైల్స్‌

సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకోవడానికి, యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉద్యమం క్షిపణులు, డ్రోన్‌లను మాత్రమే ఆయుధాలుగా ఉపయోగించడం లేదు. ఈ మిలిషియా, అధికారిక ప్రకటనలు, వీడియోలు, పాటలు, సోషల్ మీడియా కంటెంట్ ద్వారా సౌదీ రాచరికానికి వ్యతిరేకంగా మీడియా ప్రచారాన్ని ఉధృతం చేయడానికి, అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన పత్రాలను కూడా ఉపయోగిస్తోంది. 
 
ఈ ప్రచారంలో ప్రధానాంశం ఏమిటంటే, మక్కాలోని గ్రాండ్ మసీదు మధ్యలో ఉన్న ఘనాకార పుణ్యక్షేత్రమైన కాబాను కప్పిన వస్త్ర చిత్రాలను ఎప్స్టీన్‌కు అందజేయడానికి సౌదీ రాజ దర్బారుకు సంబంధించిన వ్యక్తులు సహాయపడ్డారనే విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటూ 2019లో జైలులో మరణించిన ఈ ఫైనాన్షియర్‌కు సంబంధించి అమెరికా  అధికారులు సేకరించిన లక్షలాది పేజీల సమాచార విడుదలలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. 
 
గత నెలలో పవిత్ర నగరంపై డ్రోన్ దాడి జరిగినట్లు రియాద్ నివేదించినప్పుడు, సౌదీ అరేబియా తమపై చేసిన ఆరోపణలతో ఈ విషయాలను హౌతీలు ముడిపెట్టారు. యెమెన్ ఉద్యమం ఈ ఆరోపణను ఖండించింది. “ఎప్స్టీన్‌కు కాబా ముసుగు కల్పించిన వారే మక్కాపై దాడి చేస్తున్నారు,” అని హౌతీ అధికారుల అధ్యక్షుడు మహ్దీ అల్-మషత్, ఆ బృందం అధికారిక మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.  కరీబియన్ ప్రాంతంలోని  ఎప్స్టీన్‌  ప్రైవేట్ దీవికి ఈ వస్త్రాలు చేరినట్లు వచ్చిన ఆరోపణలను హౌతీలు తమ ప్రచారానికి ప్రధాన అంశంగా మార్చుకున్నాయి.
 
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రచారం ఉద్దేశ్యం, రాజ్యానికి వాస్తవ పాలకుడైన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టను దెబ్బతీయడం,  హౌతీలను ఇస్లామిక్ విలువల పరిరక్షకులుగా చిత్రీకరించడం. అవినీతిపరులుగా చిత్రీకరించిన పాశ్చాత్య వర్గాలతో దేశ నాయకత్వాన్ని ముడిపెట్టడానికి, ఆ వస్త్ర చిత్రాల చుట్టూ ఉన్న ఆరోపణలను వాడుకుంటున్నారు. ఈ వ్యూహం టెలివిజన్ ఛానెళ్లు, వెబ్‌సైట్లు, అధికారిక, అనధికారిక ఖాతాలు,సోషల్ మీడియా ప్రముఖులతో కూడిన విస్తృతమైన నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంది. 
 
యెమెన్ విశ్లేషకుడు, బాషా రిపోర్ట్ అనే కన్సల్టింగ్ సంస్థ వ్యవస్థాపకుడైన మహమ్మద్ అల్-బాషా, హౌతీల సమాచార ప్రసారాలు ఒక పరిమిత కార్యకలాపం నుండి, తమ రాజకీయ సందేశాలకు అనుగుణంగా అంతర్జాతీయ వార్తలను వేగంగా మార్చుకోగల ఒక వ్యవస్థీకృత మీడియా వ్యవస్థగా ఎలా పరిణామం చెందాయో వివరించారు. యెమెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సౌదీ అరేబియాకు, హౌతీలకు మధ్య తిరిగి తలెత్తిన శత్రుత్వాల మధ్య ఈ ప్రచారం జరుగుతోంది. 
 
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఘర్షణకు సంబంధించిన ప్రాంతీయ యుద్ధం కారణంగా సంఘర్షణ మళ్లీ తీవ్రమైంది.  ఈ ప్రచారం ద్వారా మక్కా, కాబా వంటి మతపరంగా అత్యంత సున్నితమైన అంశాలను రాజకీయ, సైనిక ఘర్షణలో భాగంగా సౌదీ అరేబియా, హౌతీలు ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది.   హౌతీ ఉద్యమ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ కూడా ఎప్‌స్టీన్ వ్యవహారాన్ని తన ప్రసంగాల్లో ప్రస్తావించారు. 
 
ఫిబ్రవరిలో చేసిన ప్రసంగంలో ఎప్‌స్టీన్ పత్రాలను తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, అవి నాయకులు, ఉన్నత వర్గాలకు శిక్షణ ఇచ్చే జియోనిస్ట్ వ్యవస్థను బయటపెడుతున్నాయని ఆయన ఆరోపించినట్లు వార్తా కథనాలు తెలిపాయి. ఈ వ్యాఖ్యలు హౌతీల ప్రచారంలో అమెరికా, ఇజ్రాయెల్‌లను లక్ష్యంగా చేసుకునే విస్తృత రాజకీయ సందేశంలో భాగంగా ఉన్నాయి.

యెమెన్‌కు చెందిన హాస్యనటుడు ముస్తఫా అల్ మోమరి కూడా ఈ అంశంపై వీడియో రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. సోషల్ మీడియాలో ప్రభావం ఉన్న వ్యక్తుల ద్వారా ఈ సందేశం మరింత మందికి చేరేలా హౌతీల ప్రచార వ్యవస్థ పనిచేస్తున్నట్లు వివరించింది. ఎప్‌స్టీన్ పత్రాలపై తరచూ పోస్టులు చేసే అమెరికా పాడ్‌కాస్టర్ జేక్ షీల్డ్స్ హౌతీల పోరాట సామర్థ్యాన్ని ప్రశంసించినట్లు కూడా ప్రస్తావించింది. 
 
యెమెన్‌లో హౌతీలకు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా ఘర్షణ కొనసాగుతోంది. సౌదీ అరేబియా యెమెన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా, హౌతీలు సౌదీ విమానయాన, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో ప్రారంభమైన సౌదీ నేతృత్వంలోని సైనిక జోక్యం యెమెన్‌లో తీవ్రమైన మానవతా సంక్షోభానికి కారణం అయింది. 
 
ఈ నేపథ్యంలో సౌదీ సైనిక చర్యలు, పౌరుల కష్టాలు, ప్రాంతీయ రాజకీయాలను ప్రస్తావిస్తూ హౌతీలు తమ ప్రత్యర్థిని ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి.  ఇప్పుడు ఎప్‌స్టీన్ పత్రాల్లోని ఆరోపణలను కూడా అదే ప్రచార వ్యూహంలో భాగంగా ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే యెమెన్ ఘర్షణ కేవలం సైనిక దాడులకే పరిమితం కాకుండా మతపరమైన భావోద్వేగాలు, సోషల్ మీడియా, అంతర్జాతీయ వివాదాలతో ముడిపడుతోంది.
 

About The Author