పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కుర్చీ దక్కించుకున్న రేవంత్ రెడ్డి నాడు కేసీఆర్ పాలమూరు మెడకు వేసిన ‘డిండి ఉరితాడు’ను ఇప్పుడు బిగించే కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు, బిజెపి తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జ్ శ్రీమతి డీకే అరుణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట పాలమూరు జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రితో కలిసి నిర్వహించిన నీటిపారుదల సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ముఖ్యమంత్రికి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఏమాత్రం ప్రేమ లేదని స్పష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్వగ్రామం ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని రైతులకు, యావత్ పాలమూరు రైతాంగానికి ద్రోహం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని ఆమె ధ్వజమెత్తారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తాను మంత్రిగా ఉండి పాలమూరు జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు, ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో జూరాల ప్రాజెక్టు ఆధారంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ సర్వే కోసం జీవో నెంబర్ 72ను తీసుకొచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్ల నివేదికలను తుంగలో తొక్కి, ప్రాజెక్టు అప్రోచ్‌ను జూరాల నుంచి నార్లాపూర్ శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మార్చి డిజైన్లనే మార్చేశారని అరుణ ఆరోపించారు. ఆ సమయంలో తామంతా తీవ్రంగా వ్యతిరేకించినా వినకుండా మొండిపట్టుతో మార్పులు చేసి, ఆ తర్వాత జీవో 105, 107లను తెచ్చి డిండి లిఫ్ట్ కోసం పాలమూరు ప్రాజెక్టు ద్వారా రోజుకు 0.5 టీఎంసీ తరలించే కుట్ర చేశారని ఆమె మండిపడ్డారు.
నాడు కేసీఆర్ పాలమూరు రైతుల మెడకు ఉరితాడు వేస్తే, ఎమ్మెల్యేలతో కలిసి పెద్ద ఎత్తున పోరాడి ఆ పనులను అడ్డుకున్నామని తెలిపారు. కానీ నేడు ముఖ్యమంత్రిగా వచ్చిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ వేసిన అదే ఉరితాడుకు మరింత ఉచ్చు బిగిస్తూ డిండి లిఫ్ట్ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చి పాలమూరుకు దగా చేస్తున్నారని తీవ్ర ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ఫ్లోరైడ్ ప్రాంతాల సమస్య పరిష్కారానికి పుట్టగండి లిఫ్ట్, ఎస్ఎల్బీసి (ఏఎంఆర్ ప్రాజెక్ట్), నక్కలగండి వంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా నీటిని తరలించడంలో ఎవరికీ అభ్యంతరం లేదని అరుణ స్పష్టం చేశారు.
కానీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని డిండి లిఫ్ట్‌ను బలవంతంగా లింక్ చేస్తూ, ఏదుల రిజర్వాయర్ నుంచి పైప్లైన్లు వేసి నీటిని తరలిస్తామని చెప్పడం జిల్లా రైతుల హక్కులను హరించడమేనని నిలదీశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అదనంగా 0.6 టీఎంసీ కాదు కదా ఒకటి లేదా రెండు టీఎంసీలు తోడే సామర్థ్యం ఉంటే ఆ నీటినంతా ఇంకా లక్షలాది ఎకరాలు బీడుపడి ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
డిండి ప్రాజెక్టు కాల్వల వల్ల దాదాపు 60 కిలోమీటర్ల మేర పాలమూరు భూములు, 30కి పైగా గ్రామాలు ముంపునకు గురవుతుంటే ఇక్కడి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదని పేర్కొంటూ నల్గొండ నాయకులు తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఏకమవుతుంటే పాలమూరు ప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం జిల్లా హక్కులను తాకట్టు పెడతారా? అని అరుణ నిలదీశారు.
పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు దశాబ్ద కాలంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రిజర్వాయర్లలో పూడిక తీయలేదని, మరమ్మతులు చేపట్టలేదని, ఆర్డీఎస్ కింద ఉన్న 15.9 టీఎంసీలు, జూరాల కింద ఉన్న 17.84 టీఎంసీల కేటాయింపులను కూడా పూర్తిస్థాయిలో ఒడిసిపట్టలేక వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారని మండిపడ్డారు.
జూరాల ప్యారలల్ ప్రాజెక్టు, బ్రిడ్జి పనులకు నిధులు కేటాయించకుండా, నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరు ఇచ్చే సమగ్ర కార్యాచరణ లేకుండా కొడంగల్, నారాయణపేటలకే అరకొరగా పరిమితం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని, పాలమూరు-రంగారెడ్డిని జూరాల నుంచి ప్రారంభించేలా నాటి అసలైన డీపీఆర్‌ను తిరిగి సమీక్షించి, పాలమూరు పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికీ సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో పాలమూరు రైతాంగ ప్రయోజనాల కోసం రాజీలేని ప్రజాపోరాటం నిర్మిస్తామని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

More Stories
సౌదీ అరేబియాపై హౌతీల కొత్త ప్రచార అస్త్రం ఎప్స్టీన్ ఫైల్స్
కాశ్మీరీలు, పాకిస్తాన్‌పై ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు `దేశద్రోహం’.. బీజేపీ
జామియాలో “ఫ్రీ కాశ్మీర్”, “ఫ్రీ షర్జీల్ ఇమామ్” పట్ల దుమారం