‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నాట్ ప్లేస్‌లో ‘లెహ్రా దో తిరంగా’ (త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే) నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన తలపెట్టగా, అంతకుముందే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం, అభిజీత్ దిప్కేకు రెండు నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసు ‘భారతీయ న్యాయ సంహిత’ (బిఎన్ఎస్) సెక్షన్ 163 అమలులో ఉన్నందున, సెంట్రల్ పార్కులోకి ప్రవేశించవద్దని పేర్కొంది.
రెండో నోటీసును నైరుతి ఢిల్లీ పోలీసులు జారీ చేశారు. ఇది గతంలో విమానాశ్రయం వద్ద అభిజీత్, అశుతోష్, సౌరవ్‌లను ముందస్తు అదుపులోకి తీసుకుని, కోర్టు ముందు హాజరుపరిచిన ఘటనకు సంబంధించినది. “ఆ సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, వారు ఏడాది పాటు ఎటువంటి ప్రజా అంతరాయం కలిగించకూడదని ఆ నోటీసులో పేర్కొన్నారు” అని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
మరోవంక, కన్నాట్ ప్లేస్‌లో జరగాల్సిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసన ప్రదర్శనకు వెళ్తుండగా, ఏఐఎస్ఏ నాయకురాలు నేహా బోరాను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిజీత్ దిప్కేను జండేవాలన్లోని ఆయన నివాసం వద్ద, నేహా బోరాను మండి హౌస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకునే సమయంలో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. జనం తోపులాట, మీడియా సిబ్బంది, భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందితో ఆ ప్రాంతం రద్దీగా మారింది.
శుక్రవారం జరగాల్సిన నిరసన ప్రదర్శనకు కొన్ని గంటల ముందు, 20 మందికి పైగా ఢిల్లీ పోలీసులు అభిజీత్ దిప్కే నివాసానికి చేరుకుని, కన్నాట్ ప్లేస్‌లో నిరసన చేపట్టవద్దని నోటీసు ఇచ్చారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం, తొక్కిసలాట జరగడం, ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున ఈ నిరసనను అనుమతించలేమని అందులో పేర్కొన్నారు.
సిజెపి సంస్థ ఈరోజు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్కులో ‘లెహ్రా దో తిరంగా’ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కన్నాట్ ప్లేస్‌లో సెక్షన్ 163 అమలులో ఉంది మరియు ‘తిరంగా యాత్ర’ నిర్వహించడానికి ఎన్డిఎంసి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు, ఢిల్లీ పోలీసులు 6,000 మందికి పైగా సిబ్బందిని, అలాగే ఒక్కొక్కటి 100 మంది సభ్యులు కలిగిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)కు చెందిన 220 కంపెనీలను న్యూఢిల్లీ ప్రాంతంలో మోహరించారు.
కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో సాయంత్రం 5 గంటలకు ‘లెహ్రా దో తిరంగా’ (త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే) కార్యక్రమాన్ని నిర్వహించాలని సిజెపి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున, కన్నాట్ ప్లేస్, దాని పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడటంపై ఆంక్షలు ఉన్నాయి. ఈ కారణంతో పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.
మరోవైపు, గురువారం నాడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ, కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో తమ సంస్థ తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమానికి ముందు, ఢిల్లీ పోలీసులు తనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అభిజీత్ దిప్కే చెప్పారు. పోలీసులు తన ఇంటి వద్దే ఉండి తన కదలికలను గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
“మేము రేపు శాంతియుతంగా (సెంట్రల్ పార్క్‌కు) వెళ్లి తిరంగాను ఎగురవేస్తాం. ఈ దేశ పౌరులమైన మేము జెండాను ఎగురవేయడాన్ని మీరు నేరంగా భావిస్తే, మీరే అతిపెద్ద దేశద్రోహులు” అని దిప్కే విమర్శించారు. పరిపాలనా కారణాల దృష్ట్యా సెంట్రల్ పార్క్‌ను శుక్రవారం, శనివారాల్లో ప్రజల కోసం మూసి ఉంచుతున్నట్లు ఎన్డిఎంసి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, జాతీయ జెండాను ఎగురవేసేందుకు, జాతీయ గీతాన్ని ఆలపించేందుకు కొంతమందికి తగిన ప్రదేశంలో అవకాశం కల్పిస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై ఆరోపించబడిన ఎన్నికల అవకతవకలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో భాగంగా, జాతీయ జెండాను ఎగురవేయడానికి శుక్రవారం సెంట్రల్ పార్క్ వద్దకు ప్రజలు, దాని మద్దతుదారులు తరలిరావాలని సీజేపీ పిలుపునిచ్చింది.
అంతేకాకుండా, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు తనను వెంబడిస్తున్నాయని, ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది తన ఇంటి బయట ఉన్న వాచ్‌మన్ నుండి సమాచారం తీసుకున్నారని సీజేపీ నాయకుడు ఆరోపించారు.

More Stories
తెలంగాణాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటులో మహిళా మోర్చా కీలక పాత్ర
టెండర్లు, బిల్లులు పొందాలంటే సీఎంకు 15 శాతం కమీషన్
అమెరికా హిందూ ఆలయంపై కాల్పులకు రెండేళ్లుగా ప్రయత్నం!