తెలంగాణ మహిళా కార్యకర్తల శక్తిసామర్థ్యాలు, నిరంతర పరిశ్రమపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కమలం వికసించి, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మహిళా మోర్చా కీలక పాత్ర పోషిస్తుందని బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి రూప్ కుమారీ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటూ పేదలు, యువత, మహిళలు, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పా రెడ్డి గారి అధ్యక్షతన వహించారు.
వివిధ రాష్ట్రాలు, విభిన్న భాషల నుంచి వచ్చినప్పటికీ ఒకే దారంలో గుచ్చిన పూలమాలలా భారతదేశ ఐక్యతను చాటుతూ మహిళా మోర్చా కార్యకర్తలు పనిచేస్తున్నారని రూప్ కుమారీ చౌదరి కొనియాడారు. నేడు భారతీయ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా కార్పొరేట్, పరిశ్రమలు, సైన్స్, రక్షణ రంగం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు తమ ప్రతిభను చాటుతున్నారని ఆమె చెప్పారు.
దేశంలో 3 కోట్లకు పైగా ‘లఖ్పతి దీదీలు’, డ్రోన్ దీదీలు తయారయ్యారని, మహిళలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసే పారిశుధ్య కార్మిక సోదరీమణుల పాదాలు కడిగి ప్రధాని మోదీ మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్నది ప్రతిపక్షాలే అయినప్పటికీ, బిజెపి ఎల్లప్పుడూ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోందని తెలిపారు.
జేఎన్యూ ఘటనలో 11 మంది ఆడబిడ్డలు న్యాయం కోసం ఫిర్యాదు చేస్తే, ‘నేను అమ్మాయిని.. పోరాడగలను’ అని ప్రగల్భాలు పలికిన ప్రియాంక గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని, వారి ద్వంద్వ నీతి బట్టబయలైందని మండిపడ్డారు. అలాంటి బాధితులకు బిజెపి మహిళా మోర్చా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
దేశంలో పేద కుటుంబానికి ఒక సొంత ఇల్లు నిర్మించుకోవడం గతంలో ఒక తీరని కలగా ఉండేదని, ఆ కష్టాలను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నేడు లక్షలాది మంది నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో ఎంపీ కోటా కింద ఒక లోక్సభ స్థానానికి ఏడాదికి కేవలం 25 గ్యాస్ కనెక్షన్లు మాత్రమే సిఫార్సు చేసే దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని, నేడు ఏ రికమండేషన్ అవసరం లేకుండానే ప్రతి నిరుపేద మహిళకు పొగలేని వంటగదిని, ఉజ్వల గ్యాస్ సిలిండర్లను అందించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.
2014లో ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రకటించినప్పుడు ప్రతిపక్షాలు హేళన చేశాయని, కానీ నిండు గర్భిణులు, గ్రామీణ మహిళలు ఆత్మగౌరవం కోసం పడిన వేదన 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్కు ఏనాడూ పట్టలేదని చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డితో పాటు, నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించే జల్ జీవన్ మిషన్ శరవేగంగా అమలవుతోందని తెలిపారు.
2014కు ముందు బ్యాంకుల వైపు చూడటానికి కూడా భయపడిన గ్రామీణ మహిళల కోసం జన్ ధన్ ఖాతాలు తెరిపించి, ఆర్థిక విప్లవానికి తెరతీశారని చెప్పారు. గతంలో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ‘ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే క్షేత్రస్థాయికి 15 పైసలు మాత్రమే చేరుతుందని, 85 పైసలు అవినీతిపాలవుతోందని’ స్వయంగా అన్నారని గుర్తుచేశారు. కానీ నేడు ప్రధాని మోదీ పారదర్శకమైన డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానాన్ని తీసుకువచ్చి, నిధులు నేరుగా అక్కాచెల్లెళ్ల బ్యాంకు ఖాతాల్లోకే జమ అయ్యేలా చేసి దళారీ వ్యవస్థను సమూలంగా అంతమొందించారని ఆమె ప్రశంసించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సదుద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని (నారీశక్తి వందన్ అధినియం) ఆమోదింపజేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండి కూటమి పార్టీలు దానికి అడ్డంకులు సృష్టించాయని తీవ్రంగా మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేక వైఖరినే అవలంబించిందన్నాని ధ్వజమెత్తారు.
More Stories
పోలీసుల అదుపులో అభిజీత్ దిప్కే, నేహా బోరా
టెండర్లు, బిల్లులు పొందాలంటే సీఎంకు 15 శాతం కమీషన్
అమెరికా హిందూ ఆలయంపై కాల్పులకు రెండేళ్లుగా ప్రయత్నం!