టెండర్లు, బిల్లులు పొందాలంటే సీఎంకు 15 శాతం కమీషన్‌

* ఓ ప్రముఖ కాంట్రాక్టర్ ఆరోపణలపై రాజకీయ ప్రకంపనలు!
 
తెలంగాణలో టెండర్లు దకించుకోవాలన్నా, చేసిన పనులకు బిల్లులు పొందాలన్నా సీఎం రేవంత్‌రెడ్డి 15 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని ప్రముఖ ఆర్వీఎం నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌  నామా రమేశ్‌ చేసిన ఆరోపణ రాజకీయ, పారిశ్రామిక వర్గాలలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కమీషన్‌ పాలన నడుస్తున్నదని, వెంటనే జోక్యం చేసుకోవాలంటూ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ)కు ఆయన ఓ లేఖ వ్రాయడం నిర్మాణరంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. 
 
ఇది రాష్ట్రంలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనని స్పష్టం చేస్తూ అయినా ఏ ఒక మంత్రిగానీ, ఎమ్మెల్యేగానీ నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రమే క్లియర్‌ అవుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు. నిర్మాణ రంగంలో బిడ్డింగ్‌ నుంచి పనులు పూర్తి చేసి అప్పగించడం వరకు తనకు 35 ఏండ్ల అనుభవం ఉన్నదని పేర్కొన్నారు. 
 
తాను వందలాది టెండర్లలో పాల్గొన్నానని వెల్లడించారు. అయినా ఈ స్థాయిలో అక్రమాలు జరిగినట్టుగా తనకు ఇంతకుముందెన్నడూ చూడలేదని అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సర్టిఫైడ్‌ బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్లకు దాదాపు రూ.20 వేల కోట్లు రావాల్సి ఉన్నదని నామా రమేశ్‌ పేర్కొన్నారు. కొన్ని బిల్లులు మూడేండ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. బిల్లులు రాక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అనేక మంది కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చికుకున్నారని వాపోయారు. 
 
కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బిల్లులను విడుదల చేయడానికి భారీ మొత్తంలో కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే తెలంగాణలో కాంట్రాక్టర్లు మిగిలే పరిస్థితి ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ అవినీతి విధానానికి, కమీషన్ల దందాకు అడ్డుకట్ట వేయడానికి బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా రంగంలోకి దిగాలని నామా రమేశ్‌ తన లేఖలో కోరారు.
ప్రభుత్వ శాఖలు, రాజకీయ పార్టీలకు ఎలాంటి కమీషన్లు ఇవ్వకుండా, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందేలా ఒక పారదర్శక విధానాన్ని తీసుకొచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.  టెండర్లు కూడా అర్హతలు ఉన్న కంపెనీలకే వచ్చేలా పారదర్శక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఆన్‌లైన్‌, గ్లోబల్‌ టెండర్ల పేరిట అధికారులు చేసే జిమ్మిక్కులతో వందలాది మంది కాంట్రాక్టర్లు రూ. వేల కోట్ల ప్రాజెక్టులను కోల్పోతున్నారని తెలిపారు.
రాజకీయ నాయకులు కమీషన్ల ఆశతో ప్రాజెక్టులను తమకు కావాల్సిన కంపెనీలకు కట్టబెట్టి, రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే బీఏఐ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పూర్తయిన బిల్లులు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని, అయినా కొత్త టెండర్లను ఎందుకు ఆహ్వానిస్తున్నదో అర్థం కావడం లేదని అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
మరోవైపు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోనే అనేక పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని ఆయన వాపోయారు. సీఎం మౌఖిక ఆదేశాల మేరకే ప్రాజెక్టులు నిలిపివేసినట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు కొనసాగుతాయో, నిలిపివేస్తారో? స్పష్టత ఇవ్వకుండా పనితీరు, బ్యాంకు గ్యారెంటీలు (పీబీజీ), ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్ల (ఈఎండీ) గడువును పొడిగించాలని సంబంధిత శాఖలు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేస్తున్నాయని తెలిపారు.

 కాగా, హెచ్‌ఎండీఏలోని హెచ్‌జీసీఎల్‌లో రేడియల్‌ రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. రేడియల్‌ రోడ్‌-2 కోసం ఇటీవల మూడు ప్యాకేజీల్లో టెండర్లను ఆహ్వానించినట్టు గుర్తుచేశారు. సాధారణంగా ఇలాంటి టెండర్లలో 10-12 కంపెనీలు పోటీ పడుతాయని, కానీ ఈసారి నలుగురు బిడ్డర్లు మాత్రమే పాల్గొన్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో ముందస్తుగా ఒప్పందాలు చేసుకున్న కంపెనీలే బరిలోకి దిగాయనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే ఇటువంటి ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలకు కాంట్రాక్టులను అప్పగిస్తోందని, ఆ కంపెనీలు అంచనా వ్యయం కంటే ఎక్కువ ధరలను పేర్కొన్నాయని ఆయన ఆరోపించారు.
 

About The Author