తెలంగాణలో హైస్పీడ్ ట్రైన్ కారిడార్ల కోసం భూసేకరణపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె–ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలకు భూసేకరణ ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మూడు మార్గాలకు సంబంధించిన అలైన్మెంట్లపై ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఢిల్లీలోని రైల్ భవన్‌లో శుక్రవారం సాయంత్రం కిషన్‌రెడ్డి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రతిపాదనలు, అలైన్‌మెంట్ అధ్యయనాల పురోగతి, తెలంగాణలో రైతులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై చర్చించారు. సమావేశానికి సంబంధించిన వివరాలను కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే తమ అధికారిక ఎక్స్ ఖాతాల్లో వేర్వేరుగా వెల్లడించారు.
హైస్పీడ్ ట్రైన్ మార్గాల కోసం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మార్కింగ్ పనులు చేపట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని కిషన్‌రెడ్డి రైల్వే మంత్రికి వివరించినట్లు తెలిపారు. భూములు కోల్పోతామనే భయంతో పలువురు రైతులు తనను కలిసి సమస్యలను వివరించారని పేర్కొన్నారు. ప్రాథమికంగా రూపొందించిన అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను కూడా చేర్చినప్పటికీ అనంతరం మార్పులు చోటుచేసుకున్నాయని, తమ ప్రాంతం మీదుగా కూడా హైస్పీడ్ రైలు నడపాలని కోరుతూ సూర్యాపేటకు చెందిన ప్రజలు తనను సంప్రదిస్తున్నారని వివరించారు.
మరోవైపు, భూసేకరణపై నెలకొన్న ఆందోళనలు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారిపై కారంపొడి చల్లిన ఘటన కూడా చోటుచేసుకున్నట్లు తెలిపారు. అలైన్‌మెంట్ ఖరారు కాకముందే భూముల గుర్తింపు, మార్కింగ్ ప్రక్రియపై స్పష్టత లేకపోవడం రైతుల్లో అనుమానాలకు కారణమవుతోందన్న అంశం ఈ సమావేశంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్‌మెంట్లపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని, మార్గాలు ఖరారైన తర్వాతే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతులకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి స్పష్టం చేసినట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే భూసేకరణ చేపడితే అది చట్టవిరుద్ధమవుతుందని తెలిపారు.
కాగా, హైస్పీడ్ రైలు కారిడార్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె, ముంబయి వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు అలైన్‌మెంట్ అధ్యయన దశలోనే ఉన్నందున.. తుది మార్గం, భూసేకరణ పరిధి, నిర్మాణ కాలపట్టికపై అధికారిక నిర్ణయాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది.
More Stories
చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత
మహిళా అధ్యాపకులపై జేఎన్టీయూహెచ్ వీసీ దుర్భాష దుమారం
దాండియాలో అన్యమతస్తులు పాల్గొంటే తీవ్ర పరిణామాలు