చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్‌ కన్నుమూత

 
ప్రముఖ సాహితీవేత్త, చారిత్రక నవలా రచయిత, ‘చారిత్రక నవలా చక్రవర్తి’గా ప్రసి ద్ధి పొందిన డాక్టర్‌ ముదిగొండ శివప్రసాద్‌ (86) గురువారం రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌-శివమ్‌రోడ్‌లోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి  రాత్రి 8.49 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు ముదిగొండ ఇందు శేఖర్‌ తెలిపారు.
 
ప్రముఖ రచయిత, చారిత్రక నవలా చక్రవర్తిగా గుర్తింపు పొందిన ముదిగొండ శివప్రసాద్‌ (86) కన్నుమూశారు. ఆయనకు గురువారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు విద్యానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగా మరోసారి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్‌ ఏపీలోని ప్రకాశం జిల్లా అల్లూరు గ్రామంలో 1940 డిసెంబరు 23న జన్మించారు.  శివప్రసాద్‌కి వివాహం కాగా ఆయన సతీమణి చాలా సంవత్సరాల కిందటే మరణించారు.  ఆయనకు ఇద్దరు కుమార్తెలు సుష్మ, శ్రీలేఖ, ఒక కుమారుడు ఇందు శేఖర్ ఉన్నారు.
 
తమ పూర్వీకులు కశ్మీరు నుంచి వచ్చి ఓరుగల్లు కాకతీయుల రాజ్యం రాణి రుద్రమ కొలువులో రాజ గురువులుగా స్థిరపడ్డారని ఆయన రాశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఉస్మానియా వర్సిటీలో ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ చేశారు. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి రచనల ప్రభావంతో నవలా రచన ప్రారంభించారు.  1959లో సికింద్రబాద్‌లోని వెస్లీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. 2000లో ఉద్యోగ విరమణ చేశారు. 
 
ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు సాహిత్యానికి సేవలందించిన ముదిగొండ శివప్రసాద్‌ ముఖ్యంగా చారిత్రక నవలా ప్రక్రియకు తనదైన శైలిని అందించారు. చరిత్రను కేవలం పుస్తకాల్లోని తేదీలు, రాజులు, యుద్ధాల సమాహారంగా కాకుండా  సజీవమైన కథగా, పాత్రలుగా, సంఘర్షణగా పాఠకుల ముందుంచడం ఆయన ప్రత్యేకత.  చరిత్ర సులభంగా అర్థమయ్యేలా కథా రూపంలో అందించాలనే లక్ష్యంతో ఆయన అనేక నవలలు రచించారు.
 
ప్రాచీన గ్రీకు సాహిత్యం, నాటకాలు, తత్వశాస్త్రంపై లోతైన పరిశోధన చేసి ప్రామాణిక గ్రంథాలు రాశారు. అమరావతి చరిత్ర నేపథ్యంలో ఆరు నవలలు రాశారు. క్రైస్తవంపైనా అధ్యయనం చేసిన ముదిగొండ శివప్రసాద్‌ కైస్త్రవ అష్టకం పేరుతో 8 పుస్తకాలు రాశారు. ఆయన రాసిన కాకతీయ కళాదర్శనం, ముసునూరి చక్రవర్తులపై తొలి చారిత్రక నవల అమృతోదయం, పాకాల చెరువు కథలు, విజ్ఞాన విపంచి వ్యాస సంపుటి తదితర 136 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 

ముదిగొండ శివప్రసాద్ రచనల్లో పట్టాభి, ఆవాహన, శ్రీపదార్చన, రెసిడెన్సీ, శ్రావణి, శ్రీలేఖ, వంశధార, విజయం, తంజావూరు, బసవగీత, మహీసర్గ, సగం విరిగిన చంద్రుడు, శ్రీపదార్చన, గంగ నుంచి గంగ వరకు, పుష్యమిత్ర, బైబిల్ డీ కోడ్ ఇలా చాలా రచనలు పాఠకులను ఆకట్టుకుని ఆయనకు ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఆయన తన బాల్యంలో ఎంవీఎస్ శర్మ, రామనాథశాస్త్రి, మార్కండేయ శర్మ వంటి ఉద్దండుల వద్ద విద్యాభ్యాసం చేశారు. 
 
ఇక ఆయన కృష్ణా పత్రిక సంపాదక వర్గం లో ముఖ్య పాత్ర పోషించారు. భారతీయ సాహిత్య పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, సింగపూర్‌, దుబారులలో కీలకోపన్యాసాలు చేశారు. కుర్తాళం పీఠాధిపతి సారథ్యంలో కనకాభిషేకం, స్వర్ణకంకణ బహూకరణ వంటి ప్రత్యేక గౌరవాలు, ఉమ్మడి ఏపీ నుంచి ఉగాది పురస్కారం వంటి అవార్డులు ఎన్నో శివప్రసాద్‌ అందుకున్నారు. 
 
శివప్రసాద్‌ రచనలపై ఉస్మానియా, నాగార్జున, శ్రీకృష్ణ దేవరాయ తదితర వర్సిటీల్లో పలువురు పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా అందుకోవడం గమనార్హం.  సాహిత్య వర్గాల్లో ఆయనకు ‘చారిత్రక నవలా చక్రవర్తి, చారిత్రక నవలా సమ్రాట్‌, శివ కవీంద్ర, అభినవ ధూర్జటి, అభినవ పాలురికి’ వంటి బిరుదులు లభించాయి.

శివప్రసాద్‌ సాహితీ జీవితంలో ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ పురసార గ్రహీత రావూరి భరద్వాజతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ అనుబంధానికి ప్రతీకగా నిలిచిన రచనల్లో ‘వంశధార’ ఒకటి. తెలుగు సాహిత్య వర్గాల్లో ఈ రచనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. శివప్రసాద్‌ రచనల్లో కనిపించే ప్రధాన లక్షణం చరిత్రను వర్తమానంతో అనుసంధానించడం. ఆయన నవలలు ఒకవైపు వినోదాన్ని అందిస్తూనే, మరోవైపు పాఠకుడిలో చరిత్రపై ఆసక్తిని పెంచాయి.

ముదిగొండ శివప్రసాద్‌ రాసిన ‘శ్రీలేఖ, శ్రీపదార్చన, తంజావూరు విజయం’ తదితర రచనలు విద్యాలయాలలో పాఠ్య పుస్తకాలయ్యాయి. ముదిగొండ శివప్రసాద్‌ కు సినిమా రంగంతోనూ అనుబంధం ఉంది. తాళ్ళపాక అన్నమాచార్య జీవిత కథను ముదిగొండ శివప్రసాద్‌ ‘శ్రీపదార్చన’ పేరుతో నవలగా రాశారు. అది జాగృతి వార ప్రతికలో సీరియల్‌గా ప్రచురితమైంది. అనంతరం దానిని లక్షకాపీలు ప్రింట్‌ చేశారు. 

నిర్మాత శాండిల్య ‘శ్రీపదార్చన’ను జంధ్యాల దర్శకత్వంలో సినిమాగా నిర్మించాలనుకున్నారు. ఆడియో క్యాసెట్‌ను సైతం విడుదల చేశారు. అయితే సినిమా పూర్తి కాలేదు. అలానే శివప్రసాద్‌ రాసిన మరో నవల స్వప్న కిరీటం, ‘దశ తిరిగింది’ పేరుతో సినిమాగా రూపుదిద్దుకుంది. చంద్రకళ పేరుతో ఆయన రాసిన నవల ఆధారంగా ‘సమ్మక సారక్క జీవిత కథ’గా డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. 

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి ముదిగొండ శివప్రసాద్‌ రచనా సహకారం అందించారు. అలానే సినిమా రంగానికి చెందిన ప్రముఖుల విశేషాలను వివరిస్తూ ముదిగొండ శివప్రసాద్‌ ‘జ్ఞాపకాల పల్లకి’ పేరుతో పుస్తకాన్ని వెలువరిచారు. శివప్రద్‌ భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం 11 గంటల వరకు సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీలోని స్వగృహంలో బంధు, మిత్రుల సందర్శనార్థం ఉంచుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

 

About The Author