దసరా నవరాత్రి ఉత్సవాలల్లో ఘనంగా నిర్వహించే దాండియా కార్యక్రమంలో ఇస్లాం, ఇతర మతస్తుల పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ కొండా శ్రీకాంత్ హెచ్చరించారు. దాండియా నృత్యంలో ఆధార్ కార్డు మార్పులు చేసుకొని మేము హిందువులం అని అసత్య మాటలు చెప్పి హిందు అమ్మాయిల్ని, మహిళల్ని మభ్యపెట్టి వారిని ప్రేమ పేరుతో లోబర్చుకొని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇస్లాం మత గ్రంథంలో పేర్కొన్నట్టుగా హిందువులు అంటే కాఫీర్లు అని, వారితో స్నేహం చేయడం, వారి దేవీ దేవతలను పూజించడం, వారి అన్న ప్రసాదాలను తినడం ఇస్లాం మతానికి విరుద్ధం అని చెప్తున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇన్ని నీతులు చెప్తున్న వారు హిందువులు చేసే కార్యక్రమంలో ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు. వారి టార్గెట్ ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.
వారికి అంతలా హిందువుల కార్యక్రమంలో పాల్గొనాలని అనిపిస్తే ముందుగా వారు తమ సోదరీ సోదరులను కూడా ఈ కార్యక్రమానికి తీసుకురావాలని హితవు చెప్పారు. వారితో హిందూ యువకులు కూడా కలిసి దాండియా నృత్యం ఆడుతారని తెలిపారు. ఇలా చేయలేని పక్షంలో వారు ఘర్ వాపస్ ద్వారా హిందువులుగా మారి ఈ కార్యక్రమంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు.
దాండియా కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులు కనుక ఈ కార్యక్రమంలోకి వచ్చేవారి ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వారి వేష భాషలను కూడా పరిగణలోకి తీసుకొని వారు హిందువులు కాని ఎడల వారిని తక్షణమే పోలీసులకు లేదా మా కార్యకర్తలకు సమాచారం ఇవ్వవలసిందిగా శ్రీకాంత్ సూచించారు. అలాగే ఈ కార్యక్రమానికి బౌన్సర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో కేవలం హిందువులను మాత్రమే రక్షణగా ఉంచాలని పేర్కొంటూ హిందువులు కాని వారిని ఉంచితే కార్యక్రమ నిర్వహణను తప్పకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్ర మందిర ప్రబంధ సమితి సభ్యులు మూసాపేట రామరాజు మాట్లాడుతూ దుర్గా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా పూజిస్తామని, దానితో పాటు కొన్నిచోట్ల దాండియా, గర్భ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కానీ ఈ కార్యక్రమంలో అన్య మతానికి సంబంధించిన వారు అక్రమంగా చొరబడి ఆధార్ కార్డులో హిందువులుగా పేర్లు మార్చుకొని, తమ కట్టు బొట్టు విషయాల్లో కూడా ఏ మాత్రం హిందువులకు తగ్గకుండా మార్పులు చేసుకొని పాల్గొంటున్నారని చెప్పారు.
ఇందులో పాల్గొని అక్కడ ఉన్న హిందూ మహిళల్ని, అమ్మాయిల్ని టార్గెట్‌గా చేసుకొని లవ్ జిహాద్‌కు గురి చేస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి దుస్సాహసాన్ని విశ్వ హిందూ పరిషత్ ఎప్పటికీ సహించబోదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. భాగ్యలక్ష్మి విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ అఖిల్, ప్రచార ప్రసార ప్రాంత సోషల్ మీడియా ప్రముఖ్ దీరజ్, అభిషేక్ లు కూడా పాల్గొన్నారు.

More Stories
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు భారత్ 3 శాంతి సూత్రాలు
ఇండియా బ్లాక్ జనపథ్ విందుకు సమాజ్‌వాదీ పార్టీ గైరాజర్!
యువ గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ మహేష్ కాక్ డేకు రామానుజన్ ప్రైజ్