జంతర్ మంతర్‌వైపు వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీలను అడ్జుకున్న పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను బుధవారం కొద్దిసేపటికే పోలీసులు విడుదల చేశారు. అంతకుముందు, ‘ఇండియా’ కూటమికి చెందిన ఇతర నేతలతో కలిసి జంతర్ మంతర్ వైపు వెళ్తుండగా, షాంగ్రి-లా హోటల్ సమీపంలోని ఒక కూడలి వద్ద బైఠాయించి నిరసన తెలిపిన వారిని ఢిల్లీ పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించి అదుపులోకి తీసుకున్నారు. 
 
రాహుల్, ఇతర నేతలను బరాఖంబా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు. ఛత్రసాల్ స్టేడియానికి తరలించిన ప్రియాంక గాంధీని కూడా తర్వాత విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమం కోసం జన్ పథ్ వద్ద సమావేశమైన ప్రతిపక్ష ఎంపీలు బస్సుల్లో బయలుదేరగా, నిర్ణీత నిరసన స్థలం వైపు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
 
“జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు మేము నిరసన ఆపబోము. ఇది దేశంలోని అత్యంత పవిత్రమైన అంశాన్ని కాపాడుకునే పోరాటం. నరేంద్ర మోదీ మరియు అమిత్ షా ఏమీ చేసినా మమ్మల్ని ఆపలేరు,” అని అదుపులోకి తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం తప్ప మరో మార్గం లేదని ప్రియాంక గాంధీ చెప్పారు. 
 
ఈ క్రమంలోనే పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో పోలీసులు తమను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా రోడ్డు మీదే నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. తనను అక్కడి నుంచి లేపేందుకు ప్రయత్నించగా, మహిళా పోలీసులు తనపై దాడి చేశారని, తన శరీరమంతా గోళ్లతో గాయపరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీని కలవాలని వెళ్తుంటే ఎంపీలను కొడతారా? అని ప్రశ్నించారు.
 
అంతకుముందు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు జంతర్ మంతర్ వైపు వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీల బస్సులను అశోకా రోడ్డు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దానితో, రాహుల్ గాంధీ తదితరులు బస్సు దిగి భారీ సంఖ్యలో ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి జంతర్ మంతర్ వైపు వెళ్లడం కనిపించింది. 
 
ఎన్నికల కమిషనర్లతో సమావేశం కోసం ఒత్తిడి చేస్తూ ఎనిమిది గంటల పాటు ధర్నా చేసిన ఒక రోజు తర్వాత, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఇండియా బ్లాక్ ధర్నా చేపడుతుందని రాహుల్ గాంధీ ఆ రోజు అంతకుముందు ప్రకటించారు. దానితో  పార్లమెంట్ సభ్యులు బస్సులు ఎక్కారు, వారిలో కొందరు త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకుని బస్సు పైకప్పు పైకి ఎక్కారు. 
 
ఈ ఊరేగింపు జనపథ్ నుండి జంతర్ మంతర్ వరకు నెమ్మదిగా సాగడంతో, అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ఆ ప్రాంతం వరుసగా రెండో రోజు కూడా స్తంభించిపోయింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవాలని సుమారు 300 మంది ఎంపీలు కోరుకున్నారని, అయితే ఎన్నికల కమిషన్ ప్రాంగణంలో నిరసన తెలిపేందుకు వారిని అనుమతించలేదని రాహుల్ గాంధీ తెలిపారు. 

About The Author