మహిళా అధ్యాపకులపై జేఎన్‌టీయూహెచ్‌ వీసీ దుర్భాష దుమారం

ఆహ్వానించడానికి వెళ్లిన తమపై జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ టీ కిరణ్‌కుమార్‌రెడ్డి దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని పేర్కొంటూ విద్యాజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాల అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. మీరు పిల్లల్ని కనడానికి మాత్రమే పనికొస్తారంటూ తమపై లింగద్వేష వ్యాఖ్యలతో అవమానించారని ఆరోపిస్తూ విసి కిరణ్‌కుమార్‌రెడ్డిపై వీజేఐటీ ప్రిన్సిపాల్‌ ఏ సృజన కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీ అనుబంధ కళాశాల విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(వీజేఐటీ) ప్రిన్సిపాల్‌ ఏ సృజన, కళాశాల సీఎస్‌ఈ విభాగాధిపతి డీ అరుణకుమారి ముందస్తుగా తీసుకున్న అనుమతితో ఈ నెల 6న కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ టీ కిరణ్‌కుమార్‌రెడ్డిని కలువడానికి వెళ్లారు. కళాశాలలో ఈ నెల 30న నిర్వహించనున్న ఏడబ్ల్యూస్‌ స్టూడెంట్‌ కమ్యూనికేషన్‌ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని వారు ఆహ్వాన పత్రిక అందచేశారు. 

దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వీసీ తనను ఆహ్వానించే అర్హత మహిళలైన మీకు లేదని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు బాధిత అధ్యాపకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలు దేనికీ పనికిరారని, వారు ఇంటికే పరిమితమై, వంటగది చూసుకోవడం, పిల్లల్ని కనడం చేయాలని వీసీ వ్యాఖ్యలు చేశారని, చెత్తబుట్టను చూపిస్తూ మీరు చెత్తకంటే హీనమైనవారని అవమానించారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తాము అభ్యంతరం తెలిపే ప్రయత్నంచేస్తే, గెట్‌ఔట్‌ అంటూ అరిచాడని తెలిపారు. అంతటితో ఆగకుండా తన టేబుల్‌పై ఉన్న సుత్తితో దాడి చేసేందుకు యత్నించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనురాగ్‌ యూనివర్శిటీ సీఈవో నీలిమను కూడా రాయలేని భాషలో దూషించినట్లు బాధితులు ఫిర్యాదులో తెలిపారు. మా ఎదుట మీరు కనీసం కూర్చోడానికి కూడా అర్హులు కాదని అవమానపర్చాడని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీజేఐటీ యాజమాన్యం తనను అవమానించిందని, దానికి ప్రతిగా విద్యాసంస్థ కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సంగతి చూస్తానంటూ వీసీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారని బాధిత మహిళలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా, ఈ యేడాది ఉద్దేశపూర్వకంగానే తాను వీజేఐటీ కళాశాల సీట్లను, ఫీజును తగ్గించానని వీసీ తమతో చెప్పారని వారు తెలిపారు. తమను దుర్భాషలాడి, దాడికి యత్నించిన వైస్‌చాన్సలర్‌పై చర్యలు తీసుకోవాలని వీజేటీ ప్రిన్సిపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృజన ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, వర్సిటీలో విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ మీడియాకు తెలిపారు.

About The Author