ఐఐటి విద్యార్థి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్‌కు క్లీన్‌చిట్?

ఐఐటి విద్యార్థి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్‌కు క్లీన్‌చిట్?
ఐఐటీ బాంబేలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సాహిల్ రవీంద్ర వాకోడే ఆత్మహత్య కేసులో ఓ ప్రొఫెసర్‌కు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదని దర్యాప్తుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే ప్రొఫెసర్‌పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికీ తుది నిర్ణయానికి రాలేదని, అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తోందని పేర్కొన్నాయి. 
 
విద్యార్థిపై ప్రొఫెసర్ కులవివక్ష వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలను బలపరిచే ప్రత్యక్ష సాక్షి లేదా ఇతర ఆధారాలు కూడా ఇప్పటివరకు లభించలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.  పరీక్ష హాల్‌, హాస్టల్‌తోపాటు క్యాంప్‌సలోని పలు ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ఆత్మహత్యకు ముందు జరిగిన వరుస పరిణామాలను తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు.
 
కాగా, పరీక్ష సమయంలో విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడినట్లు గుర్తించిన అనంతరం అతడిని పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లాలని ప్రొఫెసర్, పరీక్ష పర్యవేక్షకుడు సూర్యనారాయణ సూచించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.  ఈ ఫుటేజీని పోలీసులు విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు. భవనంలోని ఇతర సీసీటీవీ కెమెరాల్లోనూ సాహిల్ పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చి క్యాంపస్ హాస్టల్‌లోని తన గదికి వెళ్లిన దృశ్యాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 
 
బీటెక్‌ రెండో సంవత్సరం విద్యార్థి అయిన సాహిల్‌ వాకోడే గత శుక్రవారం సాయంత్రం హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకోవడం తెలిసిందే. ప్రొఫెసర్‌ సూర్యనారాయణ కుల వివక్ష చూపడం, మానసికంగా వేధించడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దీన్ని సాధారణ పోలీసు విభాగం నుంచి క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
 
మరోవంక, తమ కుమారుడి మరణానికి ప్రొఫెసర్‌ సూర్యనారాయణ, డైరెక్టర్‌ శిరీష్‌ కేదారే వేధింపులే కారణమని, వారిని అరెస్ట్‌ చేయాలని సాహిల్‌ తల్లిదండ్రులు మరోసారి డిమాండ్‌ చేశారు. అయితే.. సాహిల్‌ విద్యా సంస్థలోని ఎస్సీ/ఎస్టీ సెల్‌కు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కుమార్‌ పంత్‌ తెలిపారు. మరోవైపు, ఐఐటీ బాంబే యాజమాన్యం హాస్టళ్ల గదుల్లో సీలింగ్‌ ఫ్యాన్లు తొలగించి, వాటి స్థానంలో వాల్‌ మౌంటెడ్‌ ఫ్యాన్లు (గోడకు అమర్చే) ఏర్పాటు చేయిస్తోంది.
 
తన ఆత్మహత్యకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో పేరు నమోదైన ప్రొఫెసర్ వల్ల ఎదురైన కుల వివక్ష గురించి సాహిల్ గతంలోనే తమకు చెప్పాడని తల్లితండ్రులు తెలిపారు. “ఐఐటీలో సీటు సంపాదించడం ఎంత కష్టమో చెప్పి, ఆ పరిస్థితులను భరించమని నేను వాడికి చెప్పాను,” అని అతని తండ్రి రవీంద్ర వకోడే  పేర్కొన్నారు.  “తల్లిదండ్రులుగా మేము మా బిడ్డకు మానసిక మద్దతునిచ్చాం. అది తప్పా?” అని తల్లి సోనాలి వకోడే ప్రశ్నించారు. అలాగే ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాహిల్‌ను “వేధించిన” వారిలో ఐఐటీ బాంబే డైరెక్టర్ షిరీష్ కేదారే కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. 
 
సాహిల్ మరణం గురించి తమకు సకాలంలో సమాచారం ఇవ్వలేదని, అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని కూడా తండ్రి ఆరోపించారు. “కీలకమైన ఆధారాలను ధ్వంసం చేయడంలో ఐఐటీ యాజమాన్యం ప్రమేయం ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.