కాజీపేటలో వాహనాల తనిఖీ సందర్భంగా శుక్రవారం ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 1.38 కోట్ల విలువైన, చెలామణిలో లేని (రద్దు చేసిన) రూ. 500, రూ. 1,000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సమాచారం ప్రకారం, హన్మకొండ జిల్లాలోని కాజీపేట కూడలి వద్ద వీరిని పట్టుకున్నారు. రద్దు చేసిన ఈ కరెన్సీని చలామణిలోకి తెచ్చేందుకు వారు పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కాజీపేట పట్టణ ప్రధాన రహదారిలో వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తప్పించుకునేందుకు ప్రయత్నించిన కారును కాజీపేట పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. కారులో డ్రైవర్‌తో సహా 8 మంది ఉండగా, డిక్కీలో రూ.1.38 కోట్ల విలువైన రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు లభించాయి. పాత నోట్లను ప్రస్తుత కరెన్సీగా మార్చుకునేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
కారు, 10 మొబైల్ ఫోన్లు, రూ.6 వేల ప్రస్తుత కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ముల్లా అబ్బాస్ అలీను గుర్తించిన పోలీసులు, 8 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు. పాత నోట్లు అందించిన చెన్నైకి చెందిన మహమ్మద్ రియాజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తులు రకరకాల ఆశలు చూపిస్తూ, కుటిల ప్రయత్నాలతో సామాన్య ప్రజలను మోసం చేసే అవకాశం ఉందని ఎసిపి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యంగా అత్యాశ, దురాశ, అతి నమ్మకం కారణంగానే చాలామంది మోసాలకు గురవుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్, నకిలీ జాబ్ ఆఫర్లు, ఇతర మోసపూరిత ప్రయత్నాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులు, మాటలు లేదా ఆఫర్లు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఏ విషయాన్నైనా నమ్మే ముందు తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసి నిర్ధారించుకోవాలని సూచించారు. రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలనే అత్యాశకు దూరంగా ఉంటే మన సొమ్మును భద్రంగా కాపాడుకోవచ్చని ఏ సి పి స్పష్టం చేశారు.

More Stories
దానం నాగేందర్ అనర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చెంపపెట్టు.. బిజెపి
దానం నాగేందర్‌పై అనర్హత వేటు
22 ఏ భూముల సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ