హైడ్రా, తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

హైడ్రా, తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
 
హైదరాబాద్‍‌ నగరంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు మధ్య జరుగుతున్న భూ వివాదంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆ 40 ఎకరాల్లో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు రాగా, దాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 
 
అయితే తాజాగా ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు అనుకూలంగా, తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆ 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌ సంస్థదేనని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఆ 40 ఎకరాల భూమి తమదే అంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపంకర్ దత్త నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. 
 
ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఏకంగా 219 రోజుల ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సరైన సమయంలో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంలో విఫలం కావడంతో ఆ పిటిషన్‌ను విచారణకు తీసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లు అయింది. 
 
ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ ప్రాంతంలోని 40 ఎకరాల వివాదాస్పద భూమి ప్రైవేటుదేనని తెల్చి చెప్పింది. అయితే ఇదే 40 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉల్లంఘించి.. శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ భూమిలో హైడ్రా అధికారులు కూల్చివేతలకు పాల్పడటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తాము ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎలా కూల్చివేతలు జరుపుతారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను పదవి నుండి తొలగించాలని, ఆయన స్థానంలో సమర్థవంతమైన అధికారిని నియమించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధర్మాసనం ఆదేశాలు కూడా జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు ధిక్కార చర్యలు కూడా తీసుకోవాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించి స్టే పొందారు.