ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు ఉమ్మడి పౌరస్మృతి

ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు ఉమ్మడి పౌరస్మృతి

బీజేపీతోపాటు ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమ‌లు చేసి తీరుతామ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముంబైలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర‌వాదాన్ని ప్ర‌భుత్వం ఎంత‌మాత్రం స‌హించ‌బోద‌ని హెచ్చరించారు. 

వివిధ రంగాల్లో భ‌ద్ర‌త‌కు కూడా ప్ర‌భుత్వం ప్రాధాన్య‌మిచ్చింద‌ని చెబుతూ దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్‌డీయే పాల‌న న‌డుస్తోంద‌ని, ఈ రాష్ట్రాల్లో 2029లోపు యూసీసీని అమ‌లు చేస్తామ‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో యూసీసీ అమ‌లు దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోపు మిగ‌తా రాష్ట్రాల్లోనూ యూసీసీని అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. 

2014 నుంచి దేశంలో అవినీతి, కుల‌త‌త్వం, వార‌స‌త్వ రాజ‌కీయాలకు దూరంగా గొప్ప ప‌నితీరు క‌లిగిన రాజ‌కీయాలు సాగుతున్నాయ‌ని షా చెప్పారు. ఇండియా ఫస్ట్ అనే నినాదంతో బీజేపీ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని తెలిపారు. వెనుక‌బ‌డిన ఐదు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల జాబితా నుంచి ఇండియా టాప్ 5 ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు క‌లిగిన జాబితాలో చేరింద‌ని, ఇండియా 7.8 శాతం జీడీపీ న‌మోదు చేసింద‌ని గుర్తు చేశారు.  

గత 12 ఏళ్లలో కేంద్రం సాధించిన విజయాలను, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సాగించిన 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. “ట్రిపుల్ తలాక్ రద్దు ద్వారా ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించము. మేము అనేక రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టాము. బీజేపీ-ఎన్డీయే పాలనలో ఉన్న 21 రాష్ట్రాల్లో 2029 నాటికి యుసిసిని తప్పక అమలు చేస్తామన్న నమ్మకం నాకు ఉంది,” అని షా  స్పష్టం చేశారు. 

`భారతీయ న్యాయ సంహిత’ ద్వారా దేశ నేర న్యాయ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని పేర్కొన్న ఆయన, అనేక రాష్ట్రాల్లో కేవలం ఏడాది కాలంలోనే నేరస్తులకు శిక్ష పడే రేటు 30 శాతం పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోపే న్యాయం అందేలా చూసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. 

జాతీయ భద్రత విషయానికి వస్తే, ఆర్టికల్ 370, 35ఏ రద్దు ప్రక్రియ ఒక్క చుక్క రక్తం చిందించకుండా లేదా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండానే పూర్తయిందని, కాశ్మీర్ ఇప్పుడు పూర్తిగా భారతదేశంలో విలీనమైందని షా స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాలుగా కొనసాగిన నక్సలిజానికి ప్రభుత్వం ముగింపు పలికిందని, ఈశాన్య ప్రాంతంలో 14కు పైగా శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసిందని ఆయన తెలిపారు. 

“9,000 మందికి పైగా లొంగిపోయారు, నేడు మేము ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాము,” అని షా పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ‘ఆపరేషన్ సింధూర్’ వంటి చర్యల ద్వారా ఉగ్రవాదం పట్ల ‘జీరో టాలరెన్స్’ (అస్సలు సహించని) విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. 

ముంబై వంటి నగరాల్లో అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారుల గుర్తింపు గురించి అడిగినప్పుడు, వారిని గుర్తించడానికి ఉపయోగించే పద్ధతులను ప్రభుత్వం బహిర్గతం చేయదని షా స్పష్టం చేశారు. “ఆ పద్ధతులను బహిర్గతం చేయాలని, అది ఎలా జరుగుతుందో చెప్పాలని మీరు హోం మంత్రిని అడుగుతున్నారు. అలా చేస్తే వారిని పట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది? వారికి కూడా ఆ విషయాలు తెలిసిపోతాయి కదా,” అని ఆయన ప్రశ్నించారు. 

అక్రమ చొరబాటుదారులను గుర్తించి, దేశం నుండి బహిష్కరించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని షా మరోసారి పునరుద్ఘాటించారు. “ఈ దేశం నుండి ప్రతి ఒక్క అక్రమ చొరబాటుదారుడిని గుర్తించి, వారిని బయటకు పంపించి తీరుతామన్న మా సంకల్పాన్ని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను,” అని ఆయన చెప్పారు.