సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’

సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు  ‘సేవా సంకల్ప్ అభియాన్’
భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా దేశానికి అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకుని జాతీయ స్థాయిలో నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వెల్లడించారు.  2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, 12.5 ఏళ్లు సీఎంగా, ఆపై మరో 12.5 ఏళ్లు ప్రధానిగా మొత్తం 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన మైలురాయి అని కొనియాడారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉన్నందున, ఆ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంతో ఈ అభియాన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.  మోదీ పాలన పట్ల కృతజ్ఞతగా ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కేంద్ర పథకాల లబ్ధిదారులు ఇళ్లలో దీపాలు వెలిగించి ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా నెల రోజుల పాటు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, వ్యాసరచన పోటీలు, ‘మేరే సప్నో కా భారత్’, ‘సేవా జ్యోతి కలశ్ యాత్ర’, ‘సుశాసన్ సేవా సంవాద్’ వంటి విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. 
 
సెప్టెంబర్ 25న పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి, అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కూడా ఈ అభియాన్‌లో భాగంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ దార్శనికతతో దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక ముఖచిత్రం సమూలంగా మారాయని చెబుతూ జన్ ధన్ యోజన ద్వారా 80 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు అందించి, డీబీటీ విధానంతో అవినీతి, దళారీ వ్యవస్థను రూపుమాపారని గుర్తుచేశారు.
 
ఒకప్పుడు విమర్శలు చేసిన వారు ఆశ్చర్యపోయేలా నేడు ప్రపంచ యూపీఐ లావాదేవీల్లో భారత్ 41 శాతం వాటా సాధించిందని తెలిపారు. దేశ జీడీపీ 7.8 శాతానికి చేరిందని, గతంలో 9.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని 2.5 శాతానికి కట్టడి చేశామని చెప్పారు. విశ్వకర్మ యోజన ద్వారా చేతివృత్తుల వారికి లక్ష రూపాయల సాయం, పీఎం స్వనిధి ద్వారా దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోని సుమారు రెండు లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో వైద్యులకు రక్షణ చట్టం తేవడమే కాకుండా, స్వదేశీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించి ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేసి ఆదుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు.  మోదీ   25 ఏళ్ల పాలనా విజయాలను ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ స్ఫూర్తితో ప్రతి గడపకూ తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.