సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారికంగా ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అలాగే అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. 15న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

టీటీడీ పాలకమండలి సమావేశంలో బ్రహ్మోత్సవాల వివరాలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పాలకమండలి సభ్యులు కలిసి  విడుదల చేశారు. రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అదే కార్యక్రమంలో 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.

భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలతో పాటు సింగపూర్, జర్మనీ దేశాల నుంచి కళాకారులు పాల్గొననున్నారు. భక్తుల భద్రతకు 3,000 మంది పోలీసులతో పాటు 2,500 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని,  తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు 3,000 నుంచి 3,300 మంది సిబ్బందిని నియమిస్తున్నామని వివరించారు. 

ఈ ఏడాది గరుడసేవకు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం మంది భక్తులు అదనంగా వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని  తెలిపారు. గరుడసేవ రోజున గతేడాది 6.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా, ఈసారి 9.30 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంటూ ఇది గతేడాదితో పోలిస్తే 52 శాతం అదనం అని చెప్పారు.

భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో లైప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొంటూ ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆల‌యాల ప‌రిపాల‌నలో టీటీడీ ప్ర‌వేశ పెట్టిందని చెప్పారు. ఈ పథకం ద్వారా మరణించిన భక్తుని కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు.