శాసన సభలో బిఆర్ఎస్ సభ్యులను సెషన్ మొత్తం స్పీకర్ సస్పెండ్ చేశారు. సభను అడ్డుకుంటున్న 22 మంది సభ్యుల సస్పెన్షన్‌కు మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు చేశారు. శాసన సభ నుంచి సస్పెన్షన్ అయిన వారిలో హరీష్ రావు, కెటిఆర్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కె సంజయ్, తలసాని అనిల్ జాదవ్, కాలేరు వెంకటేశ్, విజయుడు, వివేకానంద, కోవా లక్ష్మి, మాణిక్ రావు, చింతా ప్రభాకర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డిలు ఉన్నారు.
సభా కార్యక్రమాలకు అడ్డంకులు కలిగిస్తున్నారనే కారణంతోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి, సభ ఆమోదంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా 22-ఏ భూముల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారపక్షం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రజా సమస్యలు, 22-ఏ భూముల అంశం తదితర అంశాలు చర్చకు రాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బిఆర్ఎస్ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
కాగా, శాసనసభలో గత మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలు, స్పీకర్‌ను అవమానించడం, అనంతరం పోలీసులపై దాడి వంటి అంశాలపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని శాసనసభలో ప్రకటించారు.
మరోవంక, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన దృశ్యాలను, ఇతర ఆధారాలను గవర్నర్‌కు చూపించినట్లు కేటీఆర్ తెలిపారు.
కాగా, లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్‌కుమార్ శుక్లాను పలువురు మంత్రులు కలిసి బీఆర్ఎస్ నాయకులు చేసిన శుద్ధీకరణపై ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ తొలిరోజు లోపలికి ప్రవేశించే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు స్పీకర్‌ను అవమానపర్చేవిధంగా మాట్లాడిన తీరును మంత్రులు గవర్నర్‌కు వివరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఉన్నారు.

More Stories
ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు
మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి తిరస్కరించిన శారద!
బిఆర్ఎస్ ఎంఎల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి సస్పెండ్