హైదరాబాద్‌లో ‘అహింసా స్థూపం’ ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో ‘అహింసా స్థూపం’ ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ‘అహింసా స్థూపం’ను ఘనంగా ఆవిష్కరించారు. సమాజంలో శాంతి, అహింసల ప్రాముఖ్యతను నూతన తరానికి చాటిచెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం ఒక కట్టడ నిర్మాణం కాదని, మానవాళికి ఎప్పటికీ మార్గదర్శకమయ్యే కాలాతీత సిద్ధాంతాలను భవిష్యత్ తరాలకు అందించే సత్ప్రయత్నమని అభివర్ణించారు.

భగవాన్ మహావీరుని బోధనలైన ‘పరస్పరోపగ్రహో జీవానామ్’ సూక్తి  గొప్పతనాన్ని ఆయన వివరిస్తూ సకల జీవరాశులు పరస్పర మద్దతుతోనే మనుగడ సాగిస్తాయని ఈ సూక్తి తెలియజేస్తుందని, దీన్ని స్థూపంపై చెక్కడం అభినందనీయమని కొనియాడారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ఈ అహింసా స్థంభం లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మియాపూర్ లోని వైశాలి నగర్ లో నిర్మించిన ఈ అహింసా స్థంభంను భారతదేశపు ప్రాచీన సంస్కృతిని , శాంతియుత సహజీవనాన్ని చాటేలా రూపొందించారు. జైనమత 24వ తీర్థంకరుడు అయిన భగవాన్ మహావీరుని ప్రధాన సిద్ధాంతమైన అహింస, శాంతి, జీవ కారుణ్య సందేశాలను భవిష్యత్తు తరాలకు అందించేలా ఈ అహింస స్తంభాన్ని రూపొందించారు.

భారతదేశం ఎప్పుడూ అహింసా మార్గంలోనే నడిచిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కశ్మీర్‌లో హింసను అణచివేసి శాంతిని స్థాపించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు. అహింస అనేది ఎవరికీ బలహీనత కాదని, అది దేశం గొప్ప బలమని ఆయన అభిప్రాయపడ్డారు.

అహింసా స్థూపం ఏర్పాటులో జైన సమాజ మహిళలు క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా ‘నారీశక్తి’ స్ఫూర్తిని చాటారని కిషన్ రెడ్డి కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలే సర్వతోముఖాభివృద్ధికి చోదకశక్తిగా మారుతున్నారని తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ‘నారీశక్తి వందన్ అధినియమ్’ ఇందుకు నిలువెత్తు నిదర్శనమని గుర్తుచేశారు.

హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనమని, నగర ప్రగతిలో జైన, బ్రాహ్మణ, మహేశ్వరి వంటి వర్గాల భాగస్వామ్యం మరువలేనిదని కిషన్ రెడ్డి తెలిపారు. ‘వికాస్ భీ, విరాసత్ భీ’ (అభివృద్ధి , వారసత్వం) నినాదంతో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

సమాజాన్ని విడదీయాలనుకునే శక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నేటి జెన్-జీ యువత టెక్నాలజీతో ప్రపంచాన్ని జయిస్తూనే, భారతీయ సాంస్కృతిక విలువలను ఎన్నడూ మరువకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె. విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.