ఎస్ఐఆర్  ప్రక్రియలో బిజెపి అనుకూల ఓట్లను తొలగించే కుట్ర 

ఎస్ఐఆర్  ప్రక్రియలో బిజెపి అనుకూల ఓట్లను తొలగించే కుట్ర 
ఎస్ఐఆర్  ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ, బిజెపికి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించే కుట్ర చేస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావు  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి మద్దతుదారులుగా ఉన్న లక్షలాది మంది ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తుండటంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. 
 
అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, ప్రధానంగా పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి బీజేపీకి అండగా నిలుస్తున్న ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా ఏరివేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. చివరకు బీజేపీ కీలక నాయకుల కుటుంబ సభ్యుల ఓట్లను కూడా సాంకేతిక కారణాలు, నిబంధనల పేరుతో వేధిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 
 
క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్న బీఎల్ఓలంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని గుర్తుచేస్తూ, అధికార పార్టీ అక్రమ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమ రాజ్యాంగబద్ధమైన విధులను పూర్తి నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  గతంలో ఖమ్మం జిల్లాలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఇక్కడ కూడా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పక్కా ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి న్యాయపరంగా పోరాడతామని ఆయన హెచ్చరించారు.
 
పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన కీలక ఓబీసీ, మున్నూరు కాపు సంఘం యువ నాయకులను సాదరంగా స్వాగతిస్తూ  ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం, ఆయన అందిస్తున్న ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై నేడు యువత పెద్దఎత్తున బీజేపీ వైపు వస్తున్నారని తెలిపారు. 
 
కాగా, రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఐఆర్ ద్వారా టార్గెటెడ్ ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందని ముఖ్యమంత్రి అనడం పచ్చి హాస్యాస్పదమని రామచందర్ రావు ధ్వజమెత్తారు. ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాతే కేరళలో ఎన్నికలు జరిగాయని, అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలిచినప్పుడు, ఈ ప్రక్రియను బీజేపీ విజయాలతో ఎలా ముడిపెడతారని ఆయన ప్రశ్నించారు. 
 
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత, జాతీయ సర్వేల్లో బీజేపీ బలపడుతుండటంతో వచ్చే ఓటమి భయంతోనే సీఎం ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర విద్యా వ్యవస్థ పూర్తిగా కుదేలైందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యా రంగానికి జాతీయ సగటు బడ్జెట్ కేటాయింపు 14.5 శాతం ఉంటే, తెలంగాణలో కేవలం 9 శాతం మాత్రమే కేటాయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. 
 
విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున, రాష్ట్రంలో విద్యా రంగం దిగజారడానికి ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తన విద్యాభ్యాసం సాగిన ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో సీఎం స్వయంగా వెళ్లి విద్యార్థులను అడిగి తెలుసుకోవాలని సవాల్ విసిరారు.


టీచర్ల సమస్యలను మరో రెండేళ్లలో పరిష్కరిస్తామని సీఎం చెప్పడాన్ని తప్పుపడుతూ, ఇచ్చిన ఐదేళ్లలో మూడేళ్లు చేతగాని ప్రభుత్వం, మిగిలిన రెండేళ్లలో ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు పెన్షన్లు లేక, విధుల్లో ఉన్నవారికి సరైన సమయానికి జీతాలు, ప్రమోషన్లు అందక విలవిల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

 
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులకు సగం జీతాలు ఇచ్చే దుస్థితి దాపురించిందని చెప్పారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలు లేవని, పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలిటెక్నిక్ విద్యార్థులకు బీజేపీ పూర్తి అండగా ఉంటుందని, ఇంటిగ్రేషన్ పేరుతో సాంకేతిక విద్యను నాశనం చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల కోర్సులు, సర్టిఫికెట్లకు ఎలాంటి నష్టం జరగకుండా బీజేపీ కాపాడుతుందన్నారు. వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, దావోస్ పర్యటనల ద్వారా విప్లవం సృష్టించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.