నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్‌ సీట్లు.. 9 మంది అడ్మిషన్లు రద్దు!

నీట్‌ అర్హత కలిగి ఉండి 2026-27 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసానికి రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థుల్లో 37 మంది నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు సమర్పించినట్టు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. వీరిలో 9 మంది అభ్యర్థులు ఇప్పటికే యూనివర్సిటీ పరిధిలోని మెడికల్‌ కళాశాలల్లో సీట్టు దక్కించుకున్నట్లు గుర్తించారు. నిబంధనలను అనుసరించి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన విద్యార్థుల సీట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఆయా కళాశాలలకు సమాచారం అందించారు.

నీట్ ర్యాంక్ ఆధారంగా రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులను కోరిన యూనివర్సిటీకి ఆ శాఖ డైరెక్టర్‌ ఈ నెల 22న నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఎస్టీ కోటాలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 37 మంది అభ్యర్థులు ఉన్నట్టుగా వెలుగు చూడటంతో వారిని అనర్హులుగా ప్రకటించారు.

ఇప్పటికే వికారాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో బుక్కె విశృత్‌, సిద్దిపేట ఆర్‌వీఎం ఇన్‌స్టిట్యూట్‌లో ఇరుకుల హేమాద్రి, హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాలలో నేనావత్‌ కోవిడ, నోవా ఇన్‌స్టిట్యూట్‌లో శంకరపురం రచన, ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో మాలె సాయిహర్షిణి, వడిదె చంద్రహర్షిణి, పటాన్‌చెరు రాజరాజేశ్వరి మెడికల్‌ కళాశాలలో కాకి నాగశయన, టీఆర్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎం గాయత్రీచౌహాన్‌, కరీంనగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో దేవరశెట్టి నిహాల్‌ సిద్ధార్థ్‌ పొందిన సీట్లు రద్దు చేసినట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.

ఇకపై ఈ 37 మందిని ఎస్టీ క్యాటగిరీలో పరిగణించబోమని, జనరల్‌ క్యాటగిరీలో మాత్రమే పరిగణిస్తామని యూనివర్సిటీ స్పష్టం చేసింది. రద్దు చేసిన తొమ్మిది సీట్లను ఖాళీ సీట్లుగా ప్రకటించి మలి విడత కౌన్సెలింగ్‌ ద్వారా అసలైన తెలంగాణ ఎస్టీ విద్యార్థులకు మెరిట్‌ ప్రకారం సీట్లు కేటాయించనున్నట్టు తెలియజేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ మరింత పక్కాగా చేస్తామని అధికారులు వెల్లడించారు.

 

About The Author