మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల కర్కశత్వం

మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల కర్కశత్వం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ లోపలికి వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో మహిళా సభ్యులను అరెస్టు చేసే క్రమంలో సబితా ఇంద్రారెడ్డిని జుట్టు పట్టుకుని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. 
 
“మా చీరలు లాగి, గొంతులు పట్టమని సీఎం రేవంత్ రెడ్డి మీకు ఆదేశం ఇచ్చాడా..?” అని పోలీసులు దురుసు ప్రవర్తనపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. మహళా ఎమ్మెల్యేలు అని చూడా కుండా జుట్టు పట్టి, చీరలాగి అమానవీయంగా ప్రర్తించారు.
 
రాహుల్ గాంధీ నల్ల రంగు టీ షర్ట్ వేసుకొని, దాని మీద మోడీ-అదానీ ఫోటో పెట్టుకొని పార్లమెంట్ దగ్గర ప్రశ్నించొచ్చు అంట. కానీ ఇక్కడ మేము నల్ల రంగు దుస్తులు వేసుకొని అసెంబ్లీకి వెళ్లొద్దు అనడం విడ్డూరంగా ఉందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. 
 
నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, తోపులాటలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి సహా పలువురు నేతలకు గాయాలు కావడం, బీఆర్ఎస్ సభ్యులను అరెస్ట్‌ చేయడం, మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బిఆర్ఎస్ మండిపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది.

 కాగా,తెలంగాణ శాసనసభకు వెళ్తున్న ఎమ్మెల్యేలను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు సోమవారం స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ సమీపంలో ఉదయం జరిగిన ఉద్రిక్త పరిస్థితులను సుమోటోగా లేదా ప్రత్యేక పిటిషన్ ఆధారంగా పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

శాసనసభ్యులు ఏదైనా నిబంధనలు లేదా రూల్స్ అతిక్రమిస్తే, ఆ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే పూర్తి అధికారం స్పీకర్ కే ఉంటుందని, ఇందులో పోలీసుల జోక్యం ఉండకూడదని కోర్టు తేల్చిచెప్పింది. ముఖ్యంగా, విధుల్లో భాగంగా మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను తక్షణమే గుర్తించాలని హోంశాఖను ఆదేశించింది. అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాల పూర్తి రూపురేఖలపై ఒక సమగ్ర నివేదికను కోర్టు ముందుంచాలని డీజీపీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.