శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.107.94 కోట్లతో ‘అరసవల్లి సన్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ ఏర్పాటు చేయనున్నారు. నాగావళి నది ఒడ్డున ఉన్న చారిత్రక డచ్ హెరిటేజ్ భవనాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురానున్నారు. డిజిటల్ ప్రదర్శనలు, మ్యూజియం, హస్తకళల అనుభవాలు, తదితర సదుపాయాలతో నాగావళి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు.
విజయవాడ విమానాశ్రయానికి కిలోమీటర్ దూరంలో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో రూ.176 కోట్లతో ‘గన్నవరం మైస్ సెంటర్’ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసే ఇమ్మర్సివ్ థియేటర్, ప్రసిద్ధ స్వీట్లు, జ్ఞాపికల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
నెల్లూరు జిల్లాలో వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రూ.34.29 కోట్లతో ప్రసాద్ పథకం అభివృద్ధి చేయనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రాకపోకలు, క్యూల నిర్వహణ, వేచి ఉండే ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. టూరిస్ట్ అమెనిటీ సెంటర్, వెయిటింగ్ హాళ్లు, కొత్త అన్నదాన భవనం, వంటశాల, ప్రవేశ ద్వారం, నడక మార్గాలు, ల్యాండ్‌స్కేపింగ్, భక్తుల పార్క్, కూర్చునే ప్రదేశాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు.
స్వదేశ్ దర్శన్ 2.0లో మరికొన్ని ప్రాంతాల అభివృద్ధికి కూడా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మచిలీపట్నంలో కోస్టల్ ఎక్స్పీరియన్స్, మంగళగిరి ఆలయ పరిసరాల్లో పర్యాటక సదుపాయాలు, మంగళగిరి ఎకో పార్క్ అభివృద్ధి, నంద్యాల జిల్లాలో బెలూం గుహల్లో కేవ్ లైటింగ్, సందర్శకులకు సదుపాయాల కల్పన వంటివి వీటిలో ఉన్నాయి.

More Stories
విజయవంతంగా ఈవోఎస్-05 ఉపగ్రహ ప్రయోగం
విజయవాడలో ఆకట్టుకున్న ‘భువన విజయము’ సాహిత్య రూపకం
వైసీపీలో నంబర్ 1గా సజ్జల, నంబర్ 2గా జగన్!