విజయవాడలో ఆకట్టుకున్న ‘భువన విజయము’ సాహిత్య రూపకం  

విజయవాడలో ఆకట్టుకున్న ‘భువన విజయము’ సాహిత్య రూపకం  

తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణదేవరాయల కాలం, అష్టదిగ్గజాల సాహితీ వైభవాన్ని ఆవిష్కరిస్తూ దృశ్యవేదిక, విజయవాడ ఆధ్వర్యంలో ‘భువన విజయము’ సాహిత్య రూపకాన్ని ఘనంగా ప్రదర్శించారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ డైరెక్టర్ డా. సిరికొండ రమేష్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, దొంతాల ప్రకాశ్  పాల్గొన్నారు.

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని సాహితీ వాతావరణం, అష్టదిగ్గజ కవుల వైదుష్యం, తెలుగు పద్య సౌందర్యం, తెనాలి రామకృష్ణుడి హాస్యచతురత తదితర అంశాలను సమన్వయంతో ప్రదర్శించిన ఈ రూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయలుగా దృశ్యవేదిక అధ్యక్షుడు  అంబటి మధుమోహన కృష్ణ, తిమ్మరుసుగా ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి నటించారు. 

అల్లసాని పెద్దనగా డా. గుమ్మా సాంబశివరావు, మాదయగారి మల్లనగా డా. కానుకొల్లు బాలకృష్ణ, నంది తిమ్మనగా   పంతుల తపస్వి, పింగళి సూరనగా డా. జి.వి. చలపతిరావు, ధూర్జటిగా కుందా విజయరామ్, మొల్లగా శ్రీమతి ముదిగొండ బాల కాత్యాయని, భట్టుమూర్తిగా పోపూరి గౌరీనాథ్, తెనాలి రామకృష్ణగా మల్లాప్రగడ నందకిశోర్ తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు.

ప్రత్యేక ఆకర్షణగా నాలుగేళ్ల బాల కవి చి. మల్లాప్రగడ అభిరామ్ పాల్గొనడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నర్తకి సాయి నీహారిక నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చింది. ఈ కార్యక్రమాన్ని స్వర్గీయ కృష్ణాస్వరరావుకు   అంకితం ఇచ్చారు.
కార్యక్రమాన్ని జి. సత్యానందిని సమర్థవంతంగా వ్యాఖ్యాతగా నిర్వహించారు.

తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ‘భువన విజయము’ సాహిత్య రూపకం విశేష ప్రశంసలు అందుకుంది.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పద్మశ్రీ, నరేన్ బొర్రా, వెనిగళ్ల భాస్కర్, ఎల్.ఎస్.ఆర్.కె. ప్రసాద్, అనిల్, రఘు సమర్థవంతంగా కృషి చేశారు.