హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ‘మద్రాస్ రెజిమెంట్’ స్థావరంలో చొరబడిన కొందరు పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది. హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ‘మద్రాస్ రెజిమెంట్’ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది.
శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగిన్నట్లు భావిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులు భద్రపరిచే గది తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి 4 ఏకే-47 తుపాకులు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రిని తీసుకెళ్లినట్లు తెలిపారు. వాటి విలువ మొత్తం రూ.15 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ దారుణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తోంది.
ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్‌లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న “లోపలి వ్యక్తుల” హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు.
సైన్యంలోనే బ్లాక్ షీప్స్ ఉన్నాయా లేదా వారిని వాడుకుని బయటి ముఠాలు ఈ ప్లాన్ అమలు చేశాయా? అనే కోణంలో విచారణ ముమ్మరమైంది. ఈ ఘోర భద్రతా లోపంపై ఆర్మీ అధికారులు వెంటనే సికింద్రాబాద్‌లోని బోల్లారం పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్ బృందాలు ఉమ్మడిగా దర్యాప్తు ప్రారంభించాయి.
కంటోన్మెంట్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలన్నింటినీ జల్లెడ పడుతున్నారు. ఈ ఆయుధాలు గనక బయట నేరస్థులు లేదా తీవ్రవాద ముఠాల చేతుల్లోకి వెళ్తే జరిగే వినాశనం ఊహకే అందదు. దీంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించి, అణువణువూ గాలిస్తున్నారు.

More Stories
గణేష్ నిమజ్జనంపై హైడ్రా ఆంక్షలపై భగ్గుమన్న ఉత్సవ సమితి
కాంగ్రెస్ దాడి బాధితుల పరామర్శ కు బయలుదేరిన బిజెపి నేతలు అరెస్ట్
బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నేతల ఇళ్లపై కాంగ్రెస్ దాడులు