* నితిన్ నబిన్ ఆరా… సమగ్ర దర్యాప్తుకై డిజిపికి విజ్ఞప్తి!
నల్గొండలో కాంగ్రెస్ శ్రేణులు జిల్లా బిజెపి అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి జరిపి, ఆయన అమ్మగారిని గాయపరిచిన ఘటనపై పరామర్శించేందుకు బయలుదేరుతున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులను మంగళవారం పోలీసులు గృహనిర్బంధం కావించి, అరెస్ట్ చేయడంతో కలకలం చెలరేగింది. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే హౌజ్ అరెస్ట్ చేస్తారా? ప్రజలను కలవకుండా అడ్డుకుంటారా? ఇదేనా కాంగ్రెస్ చెప్పే ప్రజాస్వామ్యం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా రాహుల్ గాంధీ రెండు నాల్కల ధోరణి? అంటూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీల గొంతును అణచివేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని రామచందర్ రావు పొలిసు స్టేషన్ నుండే హెచ్చరించారు. తన సోషల్ మీడియాలో రావు గర్జిస్తూ, “మమ్మల్ని అరెస్టు చేయడం ద్వారా నన్ను మౌనంగా ఉంచగలనని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటే, ఆయన తీవ్రంగా పొరబడుతున్నారు” అని స్పష్టం చేశారు.
ఆయన ఇంకా ఇలా పేర్కొన్నారు: “మేము 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాము, ఇందిరా గాంధీ వంటి నియంతతో పోరాడాము. మేము తలవంచము, వెనక్కి తగ్గము. సడక్ నుండి సదన్ వరకు మేము పోరాడతాము. మేము ఎలాంటి దాడులకు భయపడము. ఎలాంటి దిగ్బంధనాలకు భయపడము. ఎలాంటి అరెస్టులకు భయపడము” అని తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని, అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన కాంగ్రెస్‌ను జవాబుదారీగా ఉంచుతామని రావు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ గూండాలు దాడి చేసిన నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటి సందర్శనను అడ్డుకోవడానికి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావుతో మాట్లాడారు.
ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభాగం చేస్తున్న అవిశ్రాంత పోరాటాన్ని ప్రశంసించిన నితిన్ నబిన్‌కు, రావు నిన్నటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. రాష్ట్ర విభాగానికి జాతీయ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. రాజ్యాంగంపై రాహుల్ గాంధీ ఇచ్చే ఉపన్యాసాలు పూర్తిగా బూటకం, ఈ నియంతృత్వ మనస్తత్వానికి తెలంగాణ సమాధానం ఇస్తుందని హెచ్చరించారు.
ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే వారినే అరెస్ట్ చేస్తోందని, ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష గొంతులను అణిచివేయడానికి పోలీసులను ఉపయోగిస్తోందని పేర్కొంటూ ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయమే అని కిషన్ రెడ్డి విమర్శించారు. నల్లగొండలో బీజేపీ జిల్లా అధ్యక్షుడి నివాసంపై దాడి జరిగినప్పుడు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోంది? అని ఆయన ప్రశ్నించారు. దాడులు చేసిన వారిని వదిలిపెట్టి, బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులనే అరెస్ట్ చేయడం ఎక్కడి న్యాయం? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలు సహజమేనని, అయితే రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాలపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వ్యక్తులపై దాడులకు పాల్పడటం, మహనీయుల చిత్రాలను అవమానించడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ స్పష్టం చేశారు. ఈ ఘటనలపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడులకు గురైన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం, మద్దతు తెలిపేందుకు ఈరోజు వెళ్లేందుకు సిద్ధమైన రామచందర్ రావు, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితర నాయకులను అరెస్ట్ చేయడంను తీవ్రంగా ఖండించారు. “దాడులకు గురైన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమే. అసలు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితులకు మద్దతుగా నిలిచేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదు” అని పాయల్ శంకర్ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం డీజీపీ కార్యాలయానికి వెళ్లి, రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి జరిగిన ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి ఆయన వినతిపత్రం సమర్పించారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంపై సుమారు 50 మంది దాడికి పాల్పడినట్లు, అలాగే జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేసినట్లు పేర్కొంటూ ఆయన తల్లిపై దాడి చేసి గాయపరిచినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.
అదేవిధంగా సంత్ రవిదాస్ జీ చిత్రాన్ని అవమానించిన ఘటనపై కూడా ప్రత్యేక దర్యాప్తు జరిపి, దర్యాప్తులో నేరం నిర్ధారణ అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంతో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
More Stories
ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆస్తిగా ఉండజాలదు
పాకిస్థాన్‌లో మదర్సా కోసం వందేళ్ల నాటి ఆలయం కూల్చివేత
7.8 శాతం పెరిగిన జిడిపి… అద్భుతంగా అభివర్ణించిన ప్రధాని మోదీ